
ఎరువుల నిల్వలపై ఆరోపణలు నమ్మొద్దు
మదనాపురం: యూరియా, డీఏపీ నిల్వలపై ప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని.. రాష్ట్రంలో ఎక్కడా కొరత లేదని, అబద్ధపు ఆరోపణలు నమ్మొద్దని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని కొత్తపల్లి వద్ద కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకం మోటార్లను ఆయన ప్రారంభించి సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, రైతుబిడ్డ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నందుకే రైతులు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. రైతుల అభ్యున్నతిని దృష్టికి ఉంచుకొని ప్రభుత్వం పంట రుణమాఫీ, పెట్టుబడి సాయం, వరికి మద్దతు ధర, బోనస్ అందజేస్తోందని గుర్తు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని.. గత పాలకుల నిర్లక్ష్యంతోనే నియోజకవర్గంలోని అన్ని ఎత్తిపోతల పథకాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాకే లిఫ్ట్‌లకు పూర్వ వైభవం తీసుకొచ్చామని చెప్పారు. అనంతరం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్లు పల్లెపాగ ప్రశాంత్, కతలన్న యాదవ్, మండల సమన్వయ కమిటీ అధ్యక్షుడు చుక్కా మహేష్, కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకం చైర్మన్ రాజవర్ధన్‌రెడ్డి, నాయకులు హనుమాన్‌రావు, టీసీ నాగన్న యాదవ్, శ్రీనివాసరెడ్డి, వడ్డె రాములు, వెంకట్ నారాయణ, వడ్డె కృష్ణ, సాయిబాబా, మహదేవన్‌గౌడ్, శ్రావణ్‌కుమార్, కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.