
కనులపండువగా విగ్రహ ప్రతిష్టాపనోత్సవం
కొత్తకోట రూరల్: పట్టణ సమీపంలోని సంకల్పసిద్ధి సాయినాథ ఆలయంలో ఆదివారం ఓంకారేశ్వర శివలింగం, శ్రీ గురు దత్తాత్రేయస్వామి పాలరాతి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం కనులపండువగా సాగింది. పూజా కార్యక్రమాలను రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, ప్రముఖ వేద పండితుడు జ్యోషి గోపాలశర్మ ఆధ్వర్యంలో అర్చకుల బృందం నిర్వహించింది. వివిధ ప్రాంతాల భక్తులు వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షిర్డీసాయి ఆలయంలో భక్తులు ఓంకారేశ్వర శివలింగం, శ్రీ గురు దత్తాత్రేయస్వామిని దర్శించుకునే అవకాశం ఆలయ నిర్వాహకులు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ప్రకృతి ఒడిలో ప్రశాంత వాతావరణంలో ఆలయం ఉందని, భక్తులు ప్రశాంతత పొందవచ్చునని తెలిపారు. ఆలయ నిర్వాహకులు భక్షి శ్రీధర్‌రావు, కమిటీ సభ్యులు సాక చెన్నయ్య, నాగరాల శ్రీనివాస్‌రెడ్డి, అశ్విని కృష్ణయ్య, రాచాల కృష్ణయ్య, హరగోపాల్, మూలమళ్ల బాలకృష్ణారెడ్డి, మాధవరెడ్డి, మేస్త్రి శ్రీనివాసులు, ఆంజనేయులు తదితరులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో పట్టణవాసులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.