
పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
వనపర్తి: జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం గ్రామ పరిపాలన అధికారులు, సర్వేయర్ల పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. 49 మంది వీఆర్వోలు, వీఆర్‌ఏలు, 112 మంది సర్వేయర్లు పరీక్షలకు హాజరు కానున్నారని వివరించారు. గ్రామ పరిపాలన అధికారుల పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. సర్వేయర్ల పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతుందన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కేంద్రాల్లోకి తీసుకెళ్లడానికి అనుమతి లేదని.. ఉదయం 9.30 నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. 10 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని.. టీజీపీఎస్‌సీ పోటీ పరీక్షల నిబంధనలు అమలవుతాయని వివరించారు. పోలీస్‌శాఖ ద్వారా తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎస్పీవెంకటేశ్వరరావు, జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, ఏడీ సర్వే బాలకృష్ణ, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్‌మోహన్, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.