
వ్యక్తి మృతి.. వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆం
వనపర్తి: వైద్యులు చేసిన శస్త్రిచికత్స వికటించి ఓ వ్యక్తి మృతిచెందాడంటూ బంధువులు శుక్రవారం పెబ్బేరులోని ఓ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితుల కథనం మేరకు.. మండలంలోని పెంచికలపాడుకు చెందిన రాజు (39) మెడపై ఉన్న కణతిని తొలగించాలంటూ ఈ నెల 19న పెబ్బేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలోని ఓ వైద్యుడు చిన్నపాటి సర్జరీ చేసి కణతి తొలగించి అదే రోజు ఇంటికి పంపించారు. ఇన్‌ఫెక్షన్ కావడంతో మరునాడు వైద్యులను సంప్రదించగా.. మందులు వాడాలని సలహా ఇచ్చారు. గురువారం పొలంలో పని చేస్తూ రాజు స్పృహ కోల్పోయి పడిపోయాడు. చుట్టుపక్కల పొలాల రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటంతో వారు స్పందించి వనపర్తి జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని మహబూబ్‌నగర్‌కు సిఫారస్ చేశారు. అక్కడి వైద్యులు రక్తనాళం తెగి రక్తస్రావం అవుతుందని హైదరాబాద్‌లోని నీమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. శుక్రవారం నీమ్స్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, పలువురు ఆస్పత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకొని వారిని శాంతింపజేసి వైద్యులకు రక్షణ కల్పించారు. రాజుకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.