
పకడ్బందీగా ఏఐ విద్యాబోధన
వనపర్తి: ఏఐ విద్యాబోధనను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ఒకే చోట ఉండి కంప్యూటర్లు ఉన్న 23 పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలల్లో విద్యా సామర్థ్యాలు తక్కువగా విద్యార్థులను గుర్తించి రోజు అరగంట పాటు ఏఐ బోధన చేపట్టాలన్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఏఐ బోధన ప్రారంభమైందని.. మిగిలిన పాఠశాలల్లో ఇంటర్నెట్, హెడ్‌సెట్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించాలని కోరారు. ఇందుకు టైంటేబుల్ సిద్ధం చేసుకోవాలని, ఉదయం 10 నుంచి కంప్యూటర్ తరగతులు ప్రారంభం కావాలన్నారు. 23 పాఠశాలల్లో ప్రస్తుతం 117 పనిచేస్తున్న కంప్యూటర్లు ఉన్నాయని విద్యాశాఖ ఏఎంఓ మహానంది తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ (ఎగ్జామినేషన్) గణేష్, జీసీడీఓ శుభలక్ష్మి, శేఖర్ పాల్గొన్నారు.