
ఆధునిక సాంకేతికతతో కేసుల పరిష్కారం
వనపర్తి: ఆధునిక సాంకేతికతను వినియోగించి నేరాల నియంత్రణ, కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని అన్ని ఠాణాల కానిస్టేబుళ్లకు పని విభాగాల నిర్వహణపై ఇచ్చిన శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు. పోలీస్‌స్టేషన్లలో కేసులు పెండింగ్ ఉండకుండా చూడాలని, కేసు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఎఫ్‌ఐఆర్, పంచనామా, స్టేట్‌మెంట్ నమోదు గురించి శిక్షణలో క్షుణ్ణంగా నేర్చుకోవాలని కోరారు. కొత్త చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, కేసుల ఛేదనలో ఆధునిక సాంకేతికతను ఎలా వినియోగించాలో వివరించారు. శిక్షణ మూడురోజుల పాటు కొనసాగుతుందని.. ఠాణాలకు వెళ్లిన తర్వాత తోటి సిబ్బంది, సంబంధిత అధికారికి శిక్షణ కాలంలో నేర్చుకున్నది సవివరంగా తెలియజేయాలన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేసుల విచారణలో పరిపక్వత సాధించాలనే నిష్ణాతులైన సిబ్బందితో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని.. నిరంతరం ప్రజలకు రక్షణగా నిలుస్తాయని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి అనుసంధానం చేయాలని ఇక్కడి నుంచే పర్యవేక్షణ చేస్తారన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, ఏహెచ్‌టీయూ ఎస్‌ఐ అంజద్, ఐటీ కోర్ టెక్నికల్ టీం సిబ్బంది, గోవింద్, రవీందర్‌బాబు, పోలీసు సిబ్బంది, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.