
రైతులే నడుం బిగించి.. జమ్ము తొలగించి
పాన్‌గల్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ–1 కాల్వలో నీటి పారుదలకు అడ్డంకిగా మారిన జమ్ము, పిచ్చిమొక్కల తొలగింపునకు ఆయకట్టు రైతులు నడుం బిగించారు. కాల్వలో పూడిక తీయించడంతో పాటు జమ్ము, పిచ్చిమొక్కలను తొలగించాలని అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో రైతులే స్వయంగా రంగంలోకి దిగారు. రోజుకు కొంతమంది చొప్పున మూడు రోజులుగా కాల్వలో పెరిగిన జమ్ము, పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారు. పాన్‌గల్ మండలం తెల్లరాళ్లపల్లితండా సమీపంలో ప్రవహిస్తున్న కేఎల్‌ఐ డీ–1 కాల్వ కింద దాదాపు 100 మంది గిరిజన రైతులు 300 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ఈ కాల్వకు కొన్నేళ్లుగా మరమ్మతు చేపట్టకపోవడం.. కనీసం జమ్ము, పిచ్చిమొక్కల తొలగింపునకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ప్రతి ఏడాది సాగునీటి కోసం ఆయకట్టు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ ఏడాది అయినా సాగునీరు విడుదలకు ముందే కాల్వకు మరమ్మతు చేయించి.. సాగునీరు సాఫీగా అందేలా చూడాలని ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రాలు సమర్పించడంతో పాటు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదని ఆయకట్టు రైతులు తెలిపారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి కేఎల్‌ఐ డీ–1 కాల్వకు మరమ్మతు చేయించడంతో పాటు పూడిక, జమ్మును పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు.
కేఎల్‌ఐ డీ–1 కాల్వను శుభ్రం
చేసుకున్న ఆయకట్టు రైతులు