
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు
వనపర్తిటౌన్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందని.. బీఆర్‌ఎస్ నాయకులు లేనిపోని విమర్శలు చేయడం మానుకొని అభివృద్ధికి సహకరించాలని డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ అన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఏ ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వకుండా కాలం గడిపిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ఒక్క వనపర్తి జిల్లాలో 36,323 కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లావ్యాప్తంగా 61,687 రైతులకు రూ.49,11,43,107 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. రైతుభరోసా కింద 1,75,869 మంది రైతులకు రూ. 205 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించామని వివరించారు. ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్లు ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమనే సత్యాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నిరూపిస్తున్నారని అన్నారు. రెండు మార్లు అధికారంలోకి వచ్చి కృష్ణా, గోదావరి నీళ్ల వాటా కోసం నోరు మెదపని నాయకులు.. నేడు సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ నెల 25న న్యూఢిల్లీ తల్కటోరా స్టేడియంలో నిర్వహించే భాగీ దారి న్యాయ సమ్మేళనానికి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్దన్, మైనార్టీసెల్ అధ్యక్షుడు సమద్ మియా, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు జానకీ రాములు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరె రాములు, వివిధ మండలాల అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్, పెంటన్న యాదవ్ తదితరులు ఉన్నారు.