
అకాల వర్షం.. అపార నష్టం
కొత్తకోట రూరల్/ఖిల్లాఘనపురం/వనపర్తి రూరల్: జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి, ఆదివారం కురిసిన వర్షం, ఈదురు గాలులకు వరి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. కొత్తకోట మండలం కానాయపల్లి శివారులో వరి పంట నేలకొరగగా.. ఖిల్లా ఘనపురం మండల కేంద్రంతో పాటు మండలంలోని సల్కెలాపురం, అప్పారెడ్డిపల్లి, మల్కిమియాన్పల్లి, అల్లమాయపల్లి తదితర గ్రామాల్లో చెట్లు విరిగిపడగా మొక్క జొన్న, వరి పంటలు నేలకొరిగాయి. అల్లమాయపల్లి ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. సల్కెలాపురం, మల్కిమియాన్‌పల్లి వెళ్లే రహదారులపై చెట్లు కూలిపోయాయి. పర్వతాపురంలో మామిడి కాయలు రాలిపోయాయి. వనపర్తి మండలం పెద్దగూడెం, కడుకుంట్లలో సుమారు 58 ఎకరాల వరి పంట దెబ్బతింది. కడుకుంట్లలో మామిడి కాయలు, పిందెలు రాలి నష్టం వాటిలిందని రైతులు తెలిపారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి దెబ్బతినడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఆడుకోవాలని వేడుకుంటున్నారు.

అకాల వర్షం.. అపార నష్టం