
నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 1983 నుంచి సుమారు 40 ఏళ్లుగా ఎన్నికల బరిలో నిలుస్తూ వచ్చిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. 1983లో వైద్యరంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాగం కందనూలుతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు. టీడీపీ అభ్యర్థిగా 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. 2012 ఉపఎన్నికలోనూ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఈ క్రమంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన ఆయనకు భంగపాటు తప్పలేదు. ఈ అనూహ్య పరిణామానికి కలత చెందిన నాగం కాంగ్రెస్‌ను వీడి, బీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కొల్లాపూర్‌లో మరో కాంగ్రెస్ నేత చింతలపల్లి జగదీశ్వరరావు ఈసారి ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. 2009లో టీడీపీ నుంచి బరిలో ఉన్న ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుపై 1508 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. అనంతరం 2012 ఉప ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈసారి కాంగ్రెస్ టికెట్ ఆశించగా, జూపల్లి కృష్ణారావుకు కేటాయించడంతో జగదీశ్వరరావు పోటీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.