● 19,20 తేదీల్లో జిల్లాకు భారీ వర్షసూచన
● 145 కి.మీ. వేగంతో గాలులు
● ఆందోళనలో రైతన్నలు
విజయనగరం ఫోర్ట్/గజపతినగరం/విజయనగరం గంటస్తంభం: మొన్న ఆర్నబ్, నిన్న మురసు, నేడు ఆక్వాన్.. ఇలా వరుస తుపాన్లు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మొన్నటివరకూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక విలవిలలాడిన రైతులు.. పంట చేతికి అందే దశలో ఇప్పుడు ఆక్వాన్ తుపాను ఏ ప్రభావం చూపుతుందో అని కలవరపడుతున్నారు. కొద్దిరోజుల కిందట ఆర్నబ్ తుపాను విజయనగరం జిల్లాను వణికించింది. జిల్లాలో వందల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలో 2,483 హెక్టార్లలోని పంటలకు నష్టం వాటిల్లింది. 217 ఎకరాల్లో బొప్పాయి, 25 ఎకరాల్లోని మొక్కజొన్న, 8 ఎకరాల్లోని పత్తి, అధిక విస్తీర్ణంలో సాగుచేసిన కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఆ గాయం మానకముందే మురసు తు పాను ముంచెత్తింది. వాటి నుంచి తేరుకుంటున్న సమయంలో మరో తుపాను ఆక్వాన్ ముంచుకొస్తోంది. దీని ప్రభావంతో జిల్లాలో ఈ నెల18న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 19న జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నవంబర్ 20న కూడా మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
వరి రైతులో కలవరం
జిల్లాలో ముందుగా వేసిన వరినాట్లు, వరి వెదలు పంటకొచ్చాయి. చాలా గ్రామాల్లో కోత పనులు చురుగ్గా సాగుతున్నాయి. వాతావరణంలో మార్పులు రావడంతో కోసిన పంట కుప్పలు వేసే పనులు చేపట్టారు. తుఫాన్ హెచ్చరికలు జారీ చేయడంతో అప్రమత్తమైన రైతులు.. పండిన పంటకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు పంట కోసిన వెంటనే కుప్పలు వేస్తున్నారు. గజపతినగరం మండలంలోని గజపతినగరంతో పాటు ఎన్జీఆర్ పురం, వెంకటాపురం, పురిటిపెంట తదితర గ్రామాల రైతులు కోసిన చేలను మంగళవారం కుప్పలు పెట్టారు.
ఆక్వాన్ తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు, గంటకు 145 కి.మీ.వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ఆక్వా రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావు వేర్వేరు ప్రకటనల్లో సూచించారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి, మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర, కంది పంటలను వెంటనే కోసి సురక్షితమైన పొడి ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలన్నారు. కోసిన ధాన్యాన్ని టార్పాలిన్లతో కప్పి వర్షానికి తడవకుండా చూడాలని సూచించారు. అరటి, చెరకు, మొక్కజొన్న, కంది తదితర పంటలు బలమైన గాలులకు పడిపోకుండా అవసరమైన ఆధారాలు కల్పించాలని తెలిపారు. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లను సురక్షితమైన ఎత్తైన షెడ్లలో ఉంచాలని, పశుగ్రాసం, దాణాను తేమ తగలకుండా భద్రపరచుకోవాలని సూచించారు. తుపాను పరిస్థితులను పర్యవేక్షించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తుపానుకు సంబంఽధించిన సమాచారం, నష్టాలు, సహాయ చర్యల కోసం 08922– 236947 నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు. 24 గంటల పాటు కంట్రోల్‌రూమ్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.


