ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు రాత్రీ పగలు తేడాలేకుండా పరుగుతీశాం. ఆ క్రమంలో చిన్నచిన్న మరమ్మతులకు గురయ్యాం.. అంతే... మమ్మలను పక్కనపెట్టేశారు. మా వైపు కన్నెతి చూసేవారే కరువయ్యారు. ఏళ్ల తరబడి ఆరుబయట వదిలేయడంతో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్నాం. తుప్పుపట్టి రూపుకోల్పోయాం. చిన్నచిన్న మరమ్మతులకు గురైనప్పుడు బాగుచేస్తే తిరిగి పరుగుపెట్టేవారం. లేదంటే విక్రయించినా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. అధికారుల నిర్లక్ష్యానికి విజయనగరం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రి, వైద్యారోగ్యశాఖ కార్యాలయ పరిసరాల్లో తుప్పుపడుతున్న మా 108 వాహనాలే నిలువెత్తు నిదర్శనం. మా పార్టులు చోరీ జరుగుతున్నా పట్టించుకునేవారే లేరు. మనుషులను బాగుచేసే వైద్యాధికారులు మాకు నిర్లక్ష్యపు జబ్బు అంటగట్టారు. ఏం చేస్తాం... నిరుపయోగంగా ఉన్నాం. కనీసం స్క్రాప్ దుకాణాలకై నా విక్రయిస్తే అదే ‘పదివేలు’గా భావిస్తాం. ఇప్పటికై నా మా ఘోష ఆలకిస్తారని ఆశిస్తున్నాం.
– సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం
ఆరోగ్యశాఖ కార్యాలయం వైపు నిర్లక్ష్యంగా విడిచిపెట్టిన అంబులెన్సులు
ఆస్పత్రి పరిసర ప్రాంతంలో మూలకు చేరిన అంబులెన్సులు ఇలా...


