విజయనగరం రూరల్:
జిల్లాలో ఈ నెల 26న నిర్వహించనున్న తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. జిల్లాలోని బొబ్బిలి డివిజన్ పరిధిలో నాలుగు మండలాల్లోని 110 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు, 1054 వార్డు సభ్యుల స్థానాలకు, విజయనగరం డివిజన్ పరిధిలోని కొత్తవలస, ఎల్.కోట, ఎస్.కోట, వేపాడ మండలాల్లోని 111 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 1054 వార్డు స్థానాలకు తొలివిడతలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 13న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 15 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 118 నామినేషన్లు దాఖలు కాగా వార్డు సభ్యుల స్థానాలకు 243 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు సోమవారం నామినేషన్లు జోరందుకున్నాయి. సర్పంచ్ స్థానాలకు 650 నామినేషన్లు దాఖలు కాగా, వార్డు స్థానాలకు 2,553 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన మంగళవారం మరింతగా పోటీ చేయబోయే అభ్యర్థుల నుంచి నామినేషన్లు జోరు కొనసాగింది. సర్పంచ్ స్థానాలకు 340 నామినేషన్లు దాఖలు కాగా, వార్డు సభ్యుల స్థానాలకు 2,338 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 1108 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 5,134 నామినేషన్లు దాఖలయ్యాయి.
నేడు నామినేషన్లు పరిశీలన
మూడు రోజుల్లో దాఖలైన నామినేషన్లు పరిశీలన ప్రక్రియ బుధవారం పూర్తి చేసి, సక్రమంగా లేని నామినేషన్లు అధికారులు తిరస్కరించనున్నారు. తిరస్కరణకు గురైన నామినేషన్లు ఈ నెల 19 సాయంత్రం 5 గంటలలోపు ఆర్డీవో వద్ద అప్పీలు చేసుకునే అవకాశం ఉంది.
8 మండలాల్లో 221 సర్పంచ్
స్థానాలకు 1108 నామినేషన్లు
2,108 వార్డు సభ్యుల స్థానాలకు
5,134 నామినేషన్లు దాఖలు
నేడు నామినేషన్ల పరిశీలన


