లంచం డిమాండ్‌చేసి.. ఏసీబీకి చిక్కి... | - | Sakshi
Sakshi News home page

లంచం డిమాండ్‌చేసి.. ఏసీబీకి చిక్కి...

Nov 18 2026 1:26 AM | Updated on Nov 18 2026 1:26 AM

విజయనగరం టౌన్‌: నగర నడిబొడ్డున.. ఆర్టీసీ కాంప్లెక్స్‌కు కూతవేటు దూరంలో ఉన్న విజయనగరం అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడులతో ఉలిక్కిపడింది. తహసీల్దార్‌ కార్యాలయంలో సివిల్‌ సప్లయిస్‌ డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న కె.రామరావు రూ.15వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వి.టి.అగ్రహారం బీసీ కాలనీలోని 0094, 1000 నంబర్‌ గల రేషన్‌ దుకాణాలకు ప్రతి మూడేళ్లకు ఒకసారి ఇచ్చే అధికారిక రెన్యువల్‌ సర్టిఫికెట్‌ కోసం ప్రభుత్వ రుసుం రూ.500లు చెల్లించి రేషన్‌షాపు డీలర్‌ ఆర్జి అప్పలరాజు దరఖాస్తు చేసుకున్నారు. రెండు రేషన్‌ షాపుల రెన్యువల్‌తో పాటు రెగ్యులర్‌ తనిఖీల్లో రిమార్కులు లేకుండా చూడడానికి ప్రతినెలా ఇచ్చే మామూళ్ల పర్వం సుమారు ఎనిమిది నెలల పెండింగ్‌తో కలిసి రూ. 20వేలు డీటీ డిమాండ్‌ చేశారు. లంచం కోసం డీటీ పలుమార్లు ఒత్తిడి తీసుకురావడంతో అప్పలరాజు రూ.15వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ కె.సత్యనారాయణ, సీఐ మహేశ్వరరావు, ఎస్‌ఐ వాసునారాయణ, సిబ్బంది వలపన్నారు. కార్యాలయం బయట బాధితుడు ఆర్జి అప్పలరాజు నుంచి లంచం తీసుకుంటుండగా డీటీ రామారావును రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. రామారావు గతంలో ఎస్‌.కోట, ఎల్‌.కోట, వేపాడలో సివిల్‌ సప్లయిస్‌ డీటీగా, ఎస్‌.కోటలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ డీటీగా పనిచేశారు. గతంలో ఈయనపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.

లంచం అడిగితే ఏసీబీని సంప్రదించండి

అవినీతికి పాల్పడే వారెవరైనా సరే బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఏసీబీకి ఫిర్యాదుచేస్తే వారి ఆటకట్టిస్తామని ఏసీబీ డీఎస్పీ కె.సత్యనారాయణరావు పేర్కొన్నారు. లంచం అడిగితే 1064కి గానీ, నేరుగా కార్యాలయంలో గానీ సంప్రదించాలని కోరారు. ప్రభుత్వ సేవలకు లంచం డిమాండ్‌ చేసే అధికారులు, ఉద్యోగులపై ఏసీబీకీ సమాచారమివ్వాలని పిలుపునిచ్చారు.

ఏసీబీ వలలో సివిల్‌ సప్లయిస్‌ డిప్యూటీ తహసీల్దార్‌

రూ.15వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

తహసీల్దార్‌ కార్యాలయం

ఆవరణలోనే లంచాల వ్యవహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement