రాజాం: రాజాం మున్సిపాల్టీలో పచ్చపార్టీ పెత్తనం ఆరంభమైంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన సమయంలో పచ్చవైఖరి కొట్టొచ్చినట్లు కనిపించింది. అధికార పార్టీ అభ్యంతరాలను మాత్రమే అధికారులు పరిగణనలోకి తీసుకుని వైఎస్సార్‌సీపీ తరఫున 30వ వార్డు కౌన్సిల్ స్థానానికి సింబాల లావణ్య వేసిన నామినేషన్‌ను తిరస్కరించడం వివాదాస్పదంగా మారింది. వాస్తవంగా లావణ్య డ్వామాలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసేవారు. నాలుగునెలలు కిందట సస్పెండ్ అయ్యారు. ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే, పరిశీలన సమయంలో ఆమె ఉద్యోగం చేస్తుందన్న కారణం చూపిస్తూ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఉద్యోగానికి రిజైన్ చేసినట్టు ఆధారాలు చూపించినా అధికారులు వినిపించుకోకపోవడం గమనార్హం. మరోవైపు ఇదే వార్డులో టీడీపీ తరఫున బరిలో నిలిచిన అంపోలు సుగుణ 288వ నంబర్ రేషన్‌డిపో డీలర్‌గా ఉన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు సరుకులు అందజేశారు. ఆమె పోటీకి అనర్హురాలంటూ తావణ్య అభ్యంతరం తెలిపినా అధికారులు పట్టించుకోలేదు. ఆమె పేరు డీలర్‌గా ఆన్‌లైన్‌లో చూపిస్తున్న ఆధారాలు చూపించినా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఈ నెల 15వ తేదీ వరకూ ఆమె రేషన్ పంపిణీచేయగా, ఈలోగానే రిజైన్ చేసినట్లు ఎలా చూపిస్తారని ప్రశ్నించినా సమాధానం చెప్పేవారు కరువయ్యారు. మరోవైపు అకారణంగాన లావణ్య నామినేషన్‌ను తిరస్కరించవద్దంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, పార్టీ రాజాం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలేరాజేష్, యువనాయకుడు బెల్లాన వంశీకృష్ణ ఎన్నికల అధికారులను కోరారు.
● పరుగులెత్తిన మున్సిపల్ అధికారులు
అధికార పార్టీ నేతల సేవలో మున్సిపల్ కార్యాలయానికి చెందిన మేనేజర్ ఎం.వి.రమణ తరించారు. టీడీపీ అభ్యర్థికి అవసరమైన పలు రకాల పత్రాలు, జిరాక్స్‌లు కావాలని కోరగా, మేనేజర్ దగ్గరుండి వాటిని తీసి, ఆ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఇంకో వైపు ఆమె రేషన్ డీలర్‌గా గతంలోనే రిజైన్ చేసినట్లు రాజాం తహశీల్దార్ కార్యాలయం నుంచి అప్పటికప్పుడే పత్రాలు పుట్టుకురావడం అధికారులు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కారణం లేకుండానే
వైఎస్సార్‌సీపీ కౌన్సిల్
నామినేషన్ తిరస్కరణ
కూటమి అభ్యర్థి రేషన్ డీలర్‌గా ఉన్నా
పట్టించుకోని ఎన్నికల అధికారులు


