చంపావతి నదిలో యువకుడి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

చంపావతి నదిలో యువకుడి గల్లంతు

Nov 18 2026 1:26 AM | Updated on Nov 18 2026 1:26 AM

డెంకాడ: మండలంలోని డీకొల్లం గ్రామం వద్ద చంపావతి నదిలో యువకుడు గల్లంతైనట్టు ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు. పూసపాటిరేగ మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన పులపా వెంకటరావు (21), మరో ఇద్దరు యువకులు మంగళవారం చంపావతి నదికి స్నానం కోసం వెళ్లారు. వారిలో వెంకటరావు నదిలో మునిగిపోయాడు. యువకుడి కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలించినా ఆచూకీ లభించలేదు. చీకటి పడడంతో చంపావతి నదిలో గాలింపు చర్యలు నిలిపివేశారు.

రాత్రిపూట కోర్టులా! మాకొద్దు బాబోయ్‌!

● న్యాయవాదుల సంఘం ఏకగ్రీవ తీర్మానం

● నిరసనగా రెండు రోజులు విధులు బహిష్కరణ

విజయనగరం లీగల్‌: రాత్రిపూట కోర్టులు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విజయనగరం న్యాయవాదుల సంఘం వ్యతిరేకించింది. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నళితం రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ రాత్రి పూట కోర్టులు నిర్వహించడం సమంజసం కాదని, దీనివల్ల న్యాయవాదులు ఒత్తిడికి లోనవుతారని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనికి నిరసనగా గురు, శుక్రవారాలలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది నియామకంపై దృష్టిసారించాలని కోరారు. ఈ సమావేశంలో సంఘ ప్రతినిధులు గడి మురళీకృష్ణ, పి.బ్రహ్మాజీ, రామచంద్రరావు, మూర్తి, తదితర సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

కొండను ఢీకొని కంటైనర్‌ డ్రైవర్‌ మృతి

పాచిపెంట: మండలంలోని పి.కోనవలస చెక్‌పోస్టు ఒకటో మైలురాయి ఘాట్‌రోడ్డులో ఓ కంటైనర్‌ కొండను ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్‌ మృతిచెందినట్లు ఎస్సై అర్జున్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కంటైనర్‌ విశాఖపట్నం వస్తుండగా అదుపుతప్పి పి.కోనవలస ఘాట్‌రోడ్డులో కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్‌ను రాజస్థాన్‌కు చెందిన మనీష్‌కుమార్‌(45)గా గుర్తించారు. కంటైనర్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ మృతదేహాన్ని బయటకి తీసేందుకు సహాయకచర్యలు చేపడుతున్న క్రమంలో, నవరంగ్‌పూర్‌ నుంచి విశాఖపట్నం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వస్తున్న మరోలారీ బ్రేకులు ఫెయిలై ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సు వెనుక సీట్లో కూర్చున్న పాచిపెంట, శ్రీకాకుళం వాసులకు స్వల్పగాయాలయ్యాయి. వారిని 108లో సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.ఈ రెండు ఘటనలపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement