● దెబ్బతిన్న తెల్ల బంగారం
● వరుస తుఫాన్లతో భారీ నష్టం
● జిల్లాలో 14,283 ఎకరాల్లో సాగు
భామిని: వరుస తుఫాన్లతో జిల్లా రైతాంగం తీవ్రంగా దెబ్బతింది. పంటలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందులో ప్రధానంగా పత్తి పంట మరింత దెబ్బతింది. తుఫాన్లు పత్తి పంటపై తీవ్ర ప్రభావమే చూపింది. మొత్తంగా పత్తి మొదటి కాపు వర్షార్పణం అయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 14,283 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఇందులో హైబ్రీడ్ పత్తి సాగు విస్తీర్ణం ఇటీవల బాగా పెరిగింది. ఈ హైబ్రీడ్ సీడ్ ప్రభావం పత్తి మొదటి కాపుపై తీవ్రంగా ఉంటుంది. పంట చేనులో వర్షం నీరు నిలబడి పూత, పిందెలు రాలిపోయే పరిస్థితి నెలకొంది. పత్తి మొక్కలపై గల పత్తి బోగలు తడిసి ముద్దగా మారాయని, ముడిపత్తి కాంతివంతమైన తెలుపు రంగు కోల్పోయే దుస్థితి నెలకొంది. దీనికి తోడు వరుస తుఫాన్లతో చీడపీడలు విజృంభించాయి. బూడిద తెగులు వ్యాప్తి చెంది పత్తి మొక్కలపై ప్రభావం చూపింది. దీంతో పెరుగుదల నిలిచిపోయిందని రైతులు వాపోతున్నారు. ఇది చాలదన్నట్టు ప్రభుత్వం పంటల బీమా చెల్లించకపోవడం రైతులను మరింత కృంగదీసింది. ఈ క్రాప్ నమోదులోనూ తేడాలు నెలకొన్నాయి. మొత్తంగా పత్తి రైతులు చిత్తయ్యారు.
తగ్గిన దిగుబడి
జిల్లాలో పత్తి రైతులు మొదటి కాపులోనే సగానికి పైగా నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష క్వింటాళ్లు మొదటి విడతగా దిగుబడి రావాల్సి ఉంది. కానీ 40 వేల క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదు. గతంలో దీపావళి నాటికి ఇంటి గడపలు నిండుగా ముడి పత్తి ఉండేది. ఈ ఏడాది ఆ పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పతిరైతుల గడపలు వెలవెలబోతున్నాయి.
తగ్గిన పత్తి దిగుబడి
అధిక నాణ్యత, బరువు రావాల్సిన మొదటి తీత పత్తి దెబ్బతిని తీవ్రంగా నష్టం కలిగింది. అదనపు కూలీలతో కాయ పత్తి తీయించాల్సి ఉంది. ఎకరానికి మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకు నష్టపోతున్నాం. దీంతో ఎకరానికి రనూ.20 వేలు వరకు నష్టం. ఆదాయం గణనీయంగా తగ్గనుంది.
– వలరౌతు తిరుపతిరావు, పత్తి రైతు, సొలికిరి
పత్తి రైతుకు సూచనలు
తుఫాన్ అనంతరం పత్తి రైతుకు సూచనలు అందిస్తున్నాం. శాస్త్రవేత్తలు రైతులతో ఇష్టాగోష్టి జరిపి చైతన్య పరుస్తున్నారు. పంట దిగుబడి తగ్గకుండా చర్యలు వివరిస్తున్నాం. పంటలో నీరు తీసి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముడి పత్తి నాణ్యత తగ్గకుండా ఆరవేత పనులు చేపట్టాలి.
– భవానీ శంకర్,
జిల్లా వ్యవసాయాధికారి
పంట మార్పిడి చేసుకోవాలి
పత్తి పంట నిరంతరం సాగు చేస్తుండడంతో భూసారం తగ్గుతుంది. పంట దిగుబడి పడిపోతుంది. ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గుతుంది. పంట దిగుబడి తగ్గి ఖర్చులు పెరుగుతున్నాయి. నష్టాల బారిన పడుతున్న తరుణంలో పంట మార్పిడి చేసుకోవాలి. నష్టాల నుంచి బయటపడాలి. – షేక్ ఆఫ్రీన్, ఎంఏఓ, భామిని


