విజయనగరం ఫోర్ట్: జిల్లాలో కుష్ఠు కేసులు పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో కొత్త కేసులు బయట పడుతున్నాయి. చాలా మంది వ్యాధి లక్షణాలు ఉన్నప్పటకీ బయటకు చెప్పడం లేదనే తెలుస్తుంది. వ్యాధి తీవ్రం అయ్యే వరకు గుర్తించకపోవడం వల్ల కుష్ఠు కేసులు పెరుగుతున్నాయి. కుష్ఠు వ్యాధి పట్ల వివక్ష ఉండడం వల్ల కొంతమంది బయటకు చెప్పడం లేదనే తెలుస్తుంది. అదేవిధంగా స్పర్శ, నొప్పి లేని మచ్చలు కావడంతో సాధారణ మచ్చలుగా చాలా మంది భావిస్తున్నారు.
సెప్టెంబర్ నెల నుంచి అక్టోబర్ వరకు సర్వే
జిల్లాలో సెప్టెంబర్ నెల నుంచి అక్టోబర్ 29వ తేది వరకు కుష్ఠు వ్యాధిపై సర్వే నిర్వహించారు. జిల్లాలో ఉన్న 19 లక్షల మందిని ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు. సర్వేలో 4852 మందిని కుష్ఠు వ్యాధి అనుమానితులను గుర్తించారు. ఇందులో ఇప్పటి వరకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో 64 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇంకా 652 మందికి వైద్య పరీక్షలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం 193 కుష్ఠు కేసులు ఉన్నాయి.
కుష్ఠు పట్ల అప్రమత్తంగా ఉండాలి
కుష్ఠు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్పర్శ, నొప్పి లేని మచ్చలు కుష్ఠు వ్యాధి లక్షణాలుగా గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. కుష్ఠు వ్యాధిని సకాలంలో గుర్తించగలిగితే అంగవైకల్యం బారిన పడకుండా కాపాడవచ్చు. వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
కుష్ఠు వ్యాధిలో రెండు రకాలు
కుష్ఠు వ్యాధిలో రెండు రకాలు ఉన్నాయి. పాసిబాసిలరీ( పిబి), మల్టి బాసిలరీ( ఎం.బి) ఉన్నాయి. ఐదు మచ్చలు కంటే తక్కువగా ఉంటే పీబీ కుష్ఠు వ్యాధి అంటారు. దీనికి 6 నెలలు పాటు మల్టీ డ్రగ్ థెరిపి(ఎండీటీ) మందులు వాడాల్సి ఉంటుంది. ఐదు కంటే ఎక్కువ మచ్చలు ఉంటే ఎంబీ కుష్ఠు వ్యాధి అంటారు. దీనికి 12 నెలలు పాటు మందులు వాడాల్సి ఉంటుంది. మందులు పూర్తి స్థాయిలో వాడితే వ్యాధి నయం అవుతుంది.
సర్వే చేశాం..
జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించాం. ఇందులో 4852 మంది అనుమానితులను గుర్తించాం. వీరికి కుష్ఠు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా 64 మందికి కుష్ఠు వ్యాధి నిర్ధారణ అయింది. కుష్ఠు వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరిగింది. – డాక్టర్ కె.రాణి,
జిల్లా కుష్టు నివారణ అధికారి
కొత్తగా 64 కేసులు గుర్తింపు
ప్రస్తుతం ఉన్న కేసులు 193
జిల్లా వ్యాప్తంగా సర్వే
నిర్వహించిన వైద్య సిబ్బంది


