విజయనగరం గంటస్తంభం: జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి నిరంతరం పర్యవేక్షించారు. జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్‌తో కలిసి కంట్రోల్ రూమ్‌లో ఉండి ఎప్పటికప్పుడు ఫలితాలను సమీక్షించారు. అనంతరం జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి ఆర్‌ఓ పి.బాలాజీతో ఏర్పాట్లు, లెక్కింపు సరళిపై చర్చించారు.
జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన డాక్టర్ రేణుక
బొబ్బిలి: మండలంలోని పారాది గ్రామానికి చెందిన డాక్టర్ కలిశెట్టి రేణుక ఇనిసెట్ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో 482 ర్యాంకు సాధించి ప్రతిభ చాటారు. అఖిల భారతీయ వైద్య విద్యా సంస్థలలో (ఎయిమ్స్)లో పీజీ ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. డాక్టర్ రేణుక ఇటీవల విడుదలైన పీజీనీట్ పరీక్షలో కూడా 777 ర్యాంకు సాధించారు. ఎయిమ్స్ రాయపూర్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన రేణుక పదో తరగతి వరకూ జవహర్ నవోదయలో చదివినట్టు ఆమె తండ్రి కె.సింహాచలం మాస్టారు తెలిపారు. కాగా రేణుక తల్లి చిన్నమ్మలు కూడా ఉపాధ్యాయురాలిగానే పని చేస్తున్నారు. భవిష్యత్తులో రేడియాలజిస్టుగా మంచి సేవలందించాలని ఉందని డాక్టర్ రేణుక తెలిపారు. ఈమెకు స్థానికులు అభినందనలు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు
కృషి చేయాలి
విజయనగరం రూరల్: విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, దీనిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కాలుష్య నియంత్రణ మండలి జిల్లా ఈఈ బీబీ సరిత పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని గురజాడ పబ్లిక్ స్కూల్‌లో బ్రిక్స్ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ప్లాస్టిక్ బ్యాగులు నిరోధం, ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి కలిగే నష్టాలపై శనివారం అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. లేకుంటే భవిష్యత్ జీవనం చాలా ఇబ్బందికరంగా మారడం ఖాయమని హెచ్చరించారు. దీన్ని గుర్తించి ప్రజలు అవగాహనతో పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలన్నారు. అనంతరం విద్యార్థులకు గుడ్డ సంచులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీసీబీ సిబ్బంది, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


