విజయనగరం టౌన్: విజయనగరం రైల్వేస్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారులు శుక్రవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రూ.2 లక్షల 40వేల విలువైన 4.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జీఆర్పీ ఎస్సై డి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన బొమ్మరాజా అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రంలోని టికిరి పరిసర ప్రాంతాల నుంచి కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కమలాపూర్ ప్రాంతానికి అక్రమంగా 4.8 కిలోల గంజాయిని తరలిస్తుండగా పోలీస్ తనిఖీల్లో పట్టుబడ్డాడని, ఈ సందర్భంగా నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్ నిమిత్తం రైల్వేకోర్టుకు తరలించామని, గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు.


