విజయనగరం టౌన్: స్థానిక బాబామెట్ట ద్వారకానగర్ 8వ లైన్‌లో దాసరి అప్పలరాజు ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న రూరల్ పోలీసులు శుక్రవారం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు క్లూస్ టీమ్, డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దింపి పలు కీలక ఆధారాలను సేకరించారు. ఈ మేరకు రూరల్ ఎస్‌ఐ వెలమల ప్రసాదరావు మాట్లాడుతూ చోరీకి పాల్పడిన ఇంట్లో ప్రస్తుతం అప్పలరాజు నివాసం ఉండడం లేదని స్పష్టం చేశారు. ఆయన కుటుంబం వేరేచోట నివాసం ఉంటుందని, ప్రతిరోజూ ఇంటికి వచ్చి పూజలు చేసుకుని వెళ్తుంటారని తెలిపారు. అయితే గతంలో ఉన్న ఇంట్లో విలువైన వస్తువులు బంగారం, నగదు పోగొట్టుకున్నట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి, ఇన్విస్టిగేషన్ చేపట్టామని ఎస్సై తెలిపారు.


