● డ్రాగన్ సాగుతో రైతులకు ఊరట
● రైతులకు ప్రోత్సాహం కరువు
● ఆదాయం పెంపు దిశగా సాగు
భామిని: జిల్లా రైతులు సంప్రదాయ పంటల నుంచి అధిక ఆదాయం వచ్చే ఆధునిక పంటల వైపు దృష్టి పెట్టారు. తగిన ప్రోత్సాహం లభిస్తే ఆధునిక పంటల సాగు పెంచడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైందని వాపోతున్నారు. జిల్లాలోని ఔత్సాహిక రైతులు ఆదాయం ఇచ్చే పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారించి అందులో భాగంగా డ్రాగన్‌సాగుపై దృష్టి పెట్టారు. ఆరోగ్యాన్ని ఇచ్చే డ్రాగన్ ప్రూట్‌కు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉండడంతో సాగుపై ఆసక్తి పెంచుతున్నారు. మార్కెటింగ్ ప్యూహాన్ని పసిగట్టి, ఆర్థికంగా వెసులు బాటు ఉన్న రైతులు డ్రాగన్ ఫ్రూట్ సాగు వైపు రావాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు పిలుపు నిస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని, పార్వతీపురం, కురుపాం, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, మక్కువ ప్రాంతాల్లో డ్రాగన్ సాగుతోంది. ఆరంభంలో అధిక పెట్టుబడి కావడంతో పెద్ద రైతులు కొంత భూమిలో వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. ముందుగా తక్కువ విస్తీర్ణంలో డ్రాగన్ తోటలు వేస్తున్నారు. మార్కెట్‌లో వినియోగం పెరుగుదలకు తగ్గట్టు విస్తీర్ణం పెంచడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఉద్యాన వన శాఖ ద్వారా ఎకరాకి రూ.1 లక్ష వరకు మాత్రమే రాయితీ ఇస్తున్నారు. డ్రాగన్ పండ్ల తోటల పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు, లాభాలను ఆర్జించవచ్చని ఉద్యాపనవన అధికారులు చెబుతున్నారు.
ఎన్నో ప్రయోజనాలు..
డ్రాగన్ ఫ్రూట్ చెట్టును వాడుక భాషలో సిరి జమ్మెడ చెట్టు అంటారు. ఇది ఎడారి జాతికి చెందిన పండ్ల మొక్క. ఈ పండులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ సుగర్ వ్యాధి గ్రస్తులు యథేచ్ఛగా తినవచ్చు. ఇందులో చక్కర శాతం అతి తక్కువగా ఉండడంతో మధుమేహ బాధితులు తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ ఫ్రూట్‌లోశరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.ఈ పండును తినడం ద్వారా బరువు నియంత్రణ,అస్తమా,చెడు కొలెస్ట్రాల్ తగ్గడం.డయాబిటిస్ నియంత్రణ లాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
20 ఏళ్ల పాటు దిగుబడి
ఈ పంట ఒకసారి నాటితే 20 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తుంది.స్తంభానికి నలు దిక్కులా 2అడుగుల పొడవు, 1అడుగు లోతు గుంతలు తవ్వాలి.గుంతకు 25 కిలోల పశువుల ఎరువు,కిలో వేపపిండి వేసి మొక్కలు నాటాలి.నేలను బట్టి సాగు చేసిన రకాలను బట్టి తడులను ఇవ్వాలి.నీరు ఎక్కువైతే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది.ఏడాదిలో రెండు సార్లు జూన్–జనవరి నెలల్లో పశువుల ఎరువు వేసి సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేయాలి.సాధారణంగా డ్రాగన్ మొక్కలు తొలికాపు కాయడానికి రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది.డ్రాగన్ సాగుకు ఎకరాకి రూ.3లక్షల నుంచి రూ.4లక్షలు ఖర్చు అవుతుంది. ఎకరాకి దిగుబడి 6 నుంచి 8 టన్నుల వరకు వస్తుంది.ప్రస్తుత మార్కెట్‌లో డ్రాగన్ ప్రూట్ కేజీ ధర రూ.150 నుంచి రూ.200 పలుకుతోంది.
అన్ని రకాల నేలలు అనుకూలం..
డ్రాగన్ ఫ్రూట్‌ను పండించేందుకు అన్ని రకాలైన నేలలు అనుకూలం.ముఖ్యంగా మంచి సేంద్రియ కర్బనంతో కూడిన ఇసుక నేలలు మరింత శ్రేష్టం.ఈ పంటకు నీటి అవసరం చాలా తక్కువ.పూత,కాయ సమయాల్లో 3–4 తడులు అందించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. ఇందులో మూడు రకాలు ఉన్నాయి. అవి వైట్ ఫ్లాష్ డ్రాగన్, రెడ్ ఫ్లాష్ డ్రాగన్, ఎల్లో ఫ్లాస్ డ్రాగన్ రకాలు.
దిగుబడి బాగుంది..
డ్రాగన్ పంట సాగును తక్కువ స్థలంలో చేపట్టాం.అర ఎకరంలో పంట వేశాం. ఏడాది పొడవునా నాలుగు కాపులు వస్తోంది. ఒక్కోకాపు సమయంలో రూ.40వేల నుంచి రూ.50 వేల ఆదాయం వస్తోంది. దిగుబడి పెరిగితే మరింత విస్తరిస్తాం.ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం పెంచితే ఇంకా మంచిది.
సాసుబిల్లి రాజేంద్ర నాయుడు,డ్రాగన్ రైతు,పసుకుడి,భామిని మండలం
లక్ష వరకు రాయితీ..
డ్రాగన్ పంట సాగు ఆరంభంలో పెట్టుబడి ఎక్కువ,ఉద్యాన వన శాఖ నుంచి గిరిజన రైతులను పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సహిస్తున్నాం. ఎకరానికి రూ.1 లక్ష వరకు రాయితీ అందుతుంది.సాంకేతిక సహాయం అందిస్తాం. ఇది 20 ఏళ్ల వరకు ఆదాయం వచ్చే వాణిజ్య పంట. ఆరంభంలో కాస్త ఎక్కువ పెట్టుబడి, తరువాత ఆదాయం నిరంతరం పెరుగుతూ ఉంటుంది. ఎస్.వి.గణేష్,పీహెచ్‌ఓ,సీతంపేట


