● కౌంటింగ్ కేంద్రం వద్ద ఉపాధ్యాయుల ఆందోళన
● అరకొర వసతులపై పీఆర్టీయూ
మండిపాటు
పార్వతీపురం రూరల్: ఎన్నికల కౌంటింగ్ విధుల్లో పాల్గొన్న సిబ్బందికి కనీస సదుపాయాలు కల్పించడంలో అధికారుల అలసత్వంపై ఉపాధ్యాయులు భగ్గుమన్నారు. ఈ మేరకు ఉద్యానవన కళాశాలలోని కౌంటింగ్ కేంద్రం వద్ద శుక్రవారం వారు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అందరికీ సరిపడా భోజనాలు లేకపోవడంతో, అరకొర ఆహారంతోనే ఆకలి దప్పులకోర్చుకుంటూ విధులు నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి గమనించిన కొందరు అధికారులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల పట్ల రిటర్నింగ్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని పీఆర్టీయూ తీవ్రంగా ఆక్షేపించింది. సంఘం నేతలు అమరపు సూర్యనారాయణ, కాగాన విజయ్, శశికుమార్, రామినాయుడు తదితరులు మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిబంధనలను అధికారులు తుంగలో తొక్కారని విమర్శించారు. కౌంటింగ్ కేంద్రాల్లో మహిళా సిబ్బందికి కనీస వసతులు కల్పించకపోవడం శోచనీయమన్నారు. ఎన్నికల మరునాడు రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహాలో ‘ఆన్ డ్యూటీ’ (ఓడీ) సౌకర్యం కల్పించకుండా జిల్లాకో తీరుగా వ్యవహరించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాత్రంతా విధులు నిర్వర్తించి నిద్రలేమితో మరుసటి రోజు పాఠశాలలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లోనైనా కలెక్టర్లు జోక్యం చేసుకుని, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు, ఎన్నికల మరుసటి రోజు విధిగా ’ఓడీ’ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.


