● స్పష్టం చేసిన జంఘావతి సాధన సమితి నాయకులు
● 46వ రోజుకు చేరిన దీక్షలు
పార్వతీపురం రూరల్: జంఝావతి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన సాధన దీక్షలు శుక్రవారానికి 46వ రోజుకు చేరుకున్నాయి. పార్వతీపురం చర్చి సెంటర్లోని గిరిజన భవనం వద్ద జంఝావతి సాధన సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22న ప్రారంభమైన ఈ శిబిరానికి రైతులు, సామాజిక కార్యకర్తలు, పట్టణ ప్రముఖులు ప్రతిరోజూ విచ్చేసి సంఘీభావం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ.. 50 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న జంఝావతి ప్రాజెక్టును పూర్తి చేసి, రైతులకు సాగునీరు, పార్వతీపురం పట్టణానికి తాగునీరు అందించాలని కోరారు. ప్రస్తుతం కేంద్రంతో పాటు ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వాలు ఉన్నందున ప్రాజెక్టు పూర్తికి ఇదే అనుకూల సమయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒడిశాతో ఒప్పందం కుదుర్చుకోవాలని, నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని సమితి నాయకులు, రైతులు స్పష్టం చేశారు.


