విజయనగరం రూరల్:
జిల్లాలో గురువారం జరిగిన పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఓటరు స్వేచ్ఛగా ఓటేసేందుకు భయపడే వాతావరణాన్ని సృష్టించాయి. దాడులకు తెగబడ్డాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకున్నాయి. సరిపడా పోలీసు బందోబస్తు లేకపోవడం.. ఉన్నవారు సైతం చేతులెత్తేయడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఏజెంట్లు శివాలెత్తారు. ఓటింగ్‌ను తమకు అనుకూలంగా మలచుకున్నారు.
● జిల్లాలోని 27 జెడ్పీటీసీ స్థానాలకు, 449 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసే నాటికి 27 జెడ్పీటీసీ స్థానాల్లోనూ వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులతో కలిసి 103 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 449 ఎంపీటీసీ స్థానాలకు 11 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 438 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.
● వంగర మండలం కొండచాకరాపల్లిలో ఓటు వివాదంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసు బలగాలు హుటాహుటిన అక్కడకు చేరుకొని గుంపులను చెదరగొట్టారు.
● శ్రీహరిపురంలో రెండు వర్గాలు తగాదా పడ్డారు. ఘర్షణకు దారితీసే క్రమంలో ఎస్సై షేక్ శంకర్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు ఇరు వర్గాల గుంపులను చెదరగొట్టాయి. వంగర, రుషింగిలోనూ వాగ్వాదాలు సాగాయి.
● కోనంగిపాడు సెంగ్మెంట్ పరిధి ఇరువాడ పోలీంగ్ స్టేషన్ ఆవరణలో ప్రదర్శించిన అభ్యర్ధుల పేర్లు, గుర్తుల్లో తమకు చెందిన కుండగుర్తు సరిగ్గాలేదని ఇండిపెండెంట్ అభ్యర్ధి అభ్యంతరం తెలియజేయడంతో అరగంటకు పైగా పోలింగ్ నిలిపివేశారు.
● దుప్పాడ మండల పరిషత్ ఆదర్శ ప్రాధమిక పాఠశాల పోలింగ్ కేంద్రం గేటు వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులపై తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టారు.
పలుచోట్ల రెచ్చిపోయిన పచ్చమూకలు
వైఎస్సార్‌సీపీ లక్ష్యంగా దాడులు
దుప్పాడలో దౌర్జన్యం
బొబ్బిలిలో పోలింగ్ బూత్‌లను
విడిచిపెట్టిన అధికారులు
పరిషత్ ఎన్నికల పోలింగ్ శాతం 76.18


