బొబ్బిలి: అధికారపార్టీ నిర్వహించిన ఎన్నికల్లో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బొబ్బిలి మండలం అలజంగిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులన్నింటినీ ఒకేసారి తరలించకుండా రెండు బాక్సులు ఉంచేయడంపై ఓటర్లు ఆందోళన వ్యక్తంచేశారు. ఐదు బాక్సుల్లో మూడింటిని బస్సులో ఎక్కించి కొంత దూరం వెళ్లిపోవడం, ఓటర్ల ఆందోళన తర్వాత మిగిలిన రెండు బాక్సులను బస్సులో ఎక్కించడం అనుమానాలకు తావిచ్చింది. ఏం జరుగుతోందని గ్రామస్తులు పలువురు ప్రశ్నించారు. బస్సుకు అడ్డంగా నిల్చొని ఆందోళన చేశారు. అన్ని బాక్సులను ఒకేసారి పోలింగ్ కేంద్రానికి ఎందుకు తీసుకెళ్లలేదని నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని సర్దిచెప్పారు. ఈ విషయమై రిటర్నింగ్ అధికారిని ప్రశ్నించగా తన దృష్టికి రాలేదని, కనుక్కుంటానన్నారు.


