ఎన్‌హెచ్–316 విస్తరణకు మట్టి పరీక్షలు ప్రారంభం
12 కిలో మీటర్ల ఎలివేటెడ్ కారిడార్
పూరీ నుంచి భువనేశ్వర్ 45 నిమిషాల్లో ప్రయాణం?
భువనేశ్వర్: ఒడిశా పరిపాలనా రాజధాని భువనేశ్వర్, ఆధ్యాత్మిక రాజధాని పూరీ మధ్య రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయి. రద్దీతో సతమతమవుతున్న జాతీయ రహదారి – 316ను భారీస్థాయిలో విస్తరణకు ప్రతిపాదించిన ప్రాజెక్టుకు ప్రాథమిక పనులు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా హైవే వెంబడి కీలక ప్రాంతాల్లో మట్టి పరీక్షలు చేపట్టారు. ప్రాజెక్టు పూర్తయితే భువనేశ్వర్ – పూరీ మధ్య ప్రయాణ సమయం సుమారు 45 నిమిషాలకు తగ్గే అవకాశం ఉంది. దీంతో నిత్య ప్రయాణికులు, భక్తులు, పర్యాటకులకు వేగవంతమైన, నిరాటంక రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.
12 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్
ప్రతిపాదిత ప్రణాళికలో భువనేశ్వర్ నగర పరిధిలోని లింగిపూర్ స్క్వేర్ వరకు సుమారు 12 కిలోమీటర్ల పొడవైన యాక్సెస్ కంట్రోల్డ్ ఎలివేటెడ్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఆరు ఎలివేటెడ్ లేన్లు, ఆరు సర్వీస్ లేన్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. అంటే ఈ ప్రాంతంలో మొత్తం 12 లేన్ల రవాణా కారిడార్ అందుబాటులోకి రానుంది. లింగిపూర్ నుంచి పూరీ వరకు ఆరు లేన్ల ప్రధాన హైవేతో పాటు ఇరువైపులా రెండేసి చొప్పున నాలుగు సర్వీస్ లేన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీంతో ఈ మార్గం మొత్తం 10 – లేన్ల రవాణా కారిడార్‌గా అభివృద్ధి చెందనుంది.
రద్దీ ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం
66 కిలోమీటర్ల పూరీ – భువనేశ్వర్ మార్గంలో ప్రస్తుతం నాలుగు లేన్ల రహదారిపై భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ముఖ్యంగా పిప్పిలి టోల్‌గేట్, సత్తొసొంఖా మార్కెట్, మాలతీపత్‌పూర్ ప్రాంతాల్లో తరచూ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. అయితే రోడ్డు విస్తరణతో పాటు ఎలివేటెడ్ కారిడార్, సర్వీస్ రోడ్లు అందుబాటులోకి వస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశముంది.
పర్యాటకులు, భక్తులకు భారీ ఊరట
ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ క్షేత్రమైన పూరీకి ఏడాది పొడవునా భారీ సంఖ్యలో భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా రథయాత్ర, సున్నాబేష వంటి ప్రధాన ఉత్సవాలు, వారాంతాల్లో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. ఈ సమయంలో భువనేశ్వర్ – పూరీ మార్గంలో ఏర్పడే ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ప్రయాణ సమయం గణనీయంగా పెరుగుతోంది. కొత్త కారిడార్ అందుబాటులోకి వస్తే పూరీకి చేరుకునే సమయం తగ్గడంతో పాటు పర్యాటకుల ప్రయాణ అనుభవం మెరుగుపడనుంది. భువనేశ్వర్‌లో విమానాశ్రయం, రైల్వే తదితర రవాణా సదుపాయాలను వినియోగించుకునే పర్యాటకులకు పూరీ చేరుకోవడం మరింత సులభతరం కానుంది.
మార్గమధ్యలో సౌకర్యాలు
రహదారి విస్తరణలో కేవలం వాహనాల వేగం, సామర్థ్యానికే కాకుండా యాత్రికులు, పర్యాటకుల సౌకర్యాలకూ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రహదారి వెంట మరుగుదొడ్లు, విశ్రాంతి తదితర ప్రజా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అవసరాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో రహదారి విస్తరణను ఎనిమిది లేన్ల వరకు పెంచే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పిప్పిలి ప్రసిద్ధ చందువా అప్లిక్ కళ, స్థానిక ఉత్పత్తులు, సంప్రదాయ చేతివృత్తులను ప్రోత్సహించేలా మార్గమధ్యంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నారు. దీంతో రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు స్థానిక కళలు, హస్తకళలు, పర్యాటక రంగానికీ కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.
రహదారి భద్రతకు ప్రాధాన్యం
ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతో పాటు రహదారి భద్రతను మెరుగుపరచడం కూడా ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ప్రస్తుతం రద్దీ, వాహనాల అధిక ఒత్తిడి కారణంగా తరచూ చోటుచేసుకునే ప్రమాదాలను తగ్గించేందుకు విస్తృత రహదారి, సర్వీస్ లేన్లు, నియంత్రిత ప్రవేశ మార్గాలు దోహదపడనున్నాయి. భువనేశ్వర్ – పూరీ అనుసంధానాన్ని వేగవంతం చేసే ఈ అధిక సామర్థ్యం, అధిక వేగం కలిగిన కారిడార్ కేవలం రవాణా ప్రాజెక్టుగా కాకుండా ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి కీలక మౌలిక సదుపాయంగా పరిగణిస్తున్నారు. ప్రతిపాదిత భువనేశ్వర్ – కటక్ – పూరీ – పారాదీప్ మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధికి ఇది మరింత బలం చేకూర్చనుంది. పూరీ నీలి ఆర్థిక వ్యవస్థ, పర్యాటకం, స్థానిక వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఊతమిస్తుందని భావిస్తున్నారు. పరిపాలనా రాజధాని భువనేశ్వర్‌ను ఆధ్యాత్మిక రాజధాని పూరీతో మరింత వేగంగా, సురక్షితంగా అనుసంధానించే ఈ ప్రాజెక్టు పూర్తయితే ఒడిశా రవాణా మౌలిక సదుపాయాల్లో కీలక మార్పునకు నాంది పలికే అవకాశం ఉంది.


