ఓటరు గెలిచాడు..ఒడిశా ఓడింది..! | - | Sakshi
Sakshi News home page

ఓటరు గెలిచాడు..ఒడిశా ఓడింది..!

Nov 6 2026 2:20 AM | Updated on Nov 6 2026 2:20 AM

సాలూరు:

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి వివాదాస్పద ఆంధ్రా, ఒడిశా కొఠియా గ్రూప్‌ గ్రామాల పోలింగ్‌ విషయంలో ఓటరు గెలవగా, ఓటింగ్‌ జరగకుండా విశ్వప్రయత్నాలు చేసిన ఒడిశా ప్రభుత్వం ఓడిందా అంటే అవుననే భావన కలుగుతోంది. కొఠియా గ్రూప్‌ 21 గ్రామాల ఓటర్లు ఆంధ్రా ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండేందుకు ఒడిశా ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించింది. నేరెళ్లవలస పోలింగ్‌ కేంద్రం వద్ద ఎన్నికల నిర్వహణ జరగకుండా ఒడిశా అధికారులు అడ్డుకున్నారు.అంతటితో ఆగకుండా కొఠియా గ్రామాల్లో పోలీసులను మోహరించి గ్రామస్తుల వాహనాలను సీజ్‌చేసి వీలైనంత వరకు పోలింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.

బూత్‌ల వారిగా పోలింగ్‌ ఇలా..

కొఠియా గ్రూప్‌ 21 గ్రామాలకు సంబంధించి 5 ఎంపీటీసీ స్థానాలకు గిరిజన ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సారిక పీఎస్‌ 10లో 50.40 శాతం, కురుకుట్టి పీఎస్‌ 13లో 73.69, నేరెళ్లవలస పీఎస్‌ 8లో 31.58 శాతం, పగులుచెన్నేరు పీఎస్‌ 7లో 42.43, పట్టుచెన్నేరు పీఎస్‌ 4లో 47.69 శాతం ఓటింగ్‌ నమోదైంది.

జగన్‌మోహన్‌రెడ్డి పాలనతో ఆకర్షితులైన

కొఠియా ప్రజలు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అందించిన సంక్షేమ,అభివృద్ధి పాలనతో కొఠియా గ్రామాల ప్రజలు ఆంధ్రా వైపు మరింత ఆకర్షితమయ్యారు. ఇప్పటికే ఒడిశాలో ఉన్న ప్రజలు కూడా మా తాతలు ఆంధ్రాలో ఉండేవారని, తమను ఆంధ్రాలో కలపాలని ఆందోళనలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా ఆంధ్రావైపు ఆకర్షితులైన కొఠియా గ్రామాల ప్రజలను అడ్డుకోవాలని ఒడిశా ప్రభుత్వం తరచూ ప్రయత్నిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఎప్పటికప్పుడు ఒడిశా చర్యలకు దీటుగా సమాధానం ఇస్తూ కొఠియా గ్రామాలపై ఆంధ్రా పట్టును కొనసాగించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పరిస్థితి మారింది. కొఠియా గ్రామాలపై ఒడిశా పట్టు పెంచుకుంటూ వచ్చింది.

కొఠియా ప్రజలు ఓటు వేయకుండా

ఉండేందుకు విశ్వప్రయత్నాలుచేసిన ఒడిశా ప్రభుత్వం

తగ్గేదేలే అంటూ ఓటింగ్‌లో పాల్గొన్న కొఠియా ప్రజలు

కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో..

కొఠియా గ్రామాల విషయంలో కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్థానిక నాయకుల సహకారంతో కొఠియా గ్రామాల గిరిజనులు అటవీమార్గాల గుండా ఒడిశా అధికారులు, పోలీసులకు తెలియకుండా మైదాన ప్రాంతాలకు చేరుకున్నారు. జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ కొఠియా గ్రామాల ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేలా చాకచక్యంగా వ్యవహరించారు. మైదాన ప్రాంతాలకు ముందురోజే చేరిన ఓటర్లకు ఉండడానికి వసతి సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement