విజయనగరం టౌన్: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా విశాఖ రేంజ్ ఐజీపీ గోపీనాథ్ జెట్టి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యవేక్షించారు. ఈ మేరకు పూసపాటిరేగ మండలంలోని కుమిలి, డెంకాడ మండలంలోని మోదవలస పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంద మీటర్ల పరిధిలో ఓటర్లు మినహా మిగిలిన వ్యక్తులెవరూ ఉండకుండా చూడాలన్నారు. అనధికార వ్యక్తులు పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉండకుండా చూడాలని చెప్పారు. పార్టీ కండువాలు, గుర్తులు ధరించి పోలింగ్ కేంద్రాల వద్దకు రాకుండా చూడాలన్నారు. ఓటర్లను క్యూలో పంపాలని, ఓటు వేసిన తర్వాత ఎవరూ పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు ఉన్నారు.
వదంతులు వ్యాప్తి చేస్తే కఠినచర్యలు
ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా, వారిని పక్కదారి పట్టించే విధంగా వదంతులను ప్రచారం చేస్తే కఠినచర్యలు తప్పవని ఎస్పీ ఏఆర్ దామోదర్ హెచ్చరించారు. ఈ మేరకు జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను ఎస్పీ ఏఆర్.దామోదర్ గురువారం సందర్శించి, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాలైన నెల్లిమర్ల మండలంలోని గొర్లిపేట, కొత్తపేట, గుర్ల మండలంలోని కెల్ల, గుజ్జంగివలస, జమ్ము, గరివిడి మండలంలోని కొండపాలెం, శ్రీరాంనగర్, చీపురుపల్లి మండలంలోని చీపురుపల్లి, మెరకముడిదాం మండలంలోని గర్భాం, బుదరాయవలస, ఉత్తరావల్లి, తెర్లాం మండలంలోని తెర్లాం, ఉద్దవోలు, బాడంగి మండలంలోని బాడంగి, రామభద్రపురం మండలంలోని రామభద్రపురం, పెదమానాపురం మండలంలోని మరడాం, గజపతినగరం మండలంలోని గజపతినగరం, బొండపల్లి మండలంలో బోడసింగి పేట, గంట్యాడ, ఎస్.కోట, జామిలతో పాటూ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ ప్రదేశాల్లో ఇద్దరు అదనపు ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 18 మంది సీఐలు, 70 మంది ఎస్సైలు, ఇతర సిబ్బందితో కలిపి 2 వేల మందితో బందోబస్తు, రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, జోనల్ స్ట్రైకింగ్ ఫోర్స్లను ఏర్పాటుచేశామన్నారు. కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏవీ లీలారావు, సీఐలు జి.శంకరరావు, డీడీ.నాయుడు, సన్యాసినాయుడు, మల్లికార్జునరావు, వి.నారాయణమూర్తి, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.


