● మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ బలపడింది
● గెలిచిన ఓడిన కౌన్సిలర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులతో.. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సమావేశం
సాలూరు రూరల్: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మూడు పార్టీల కూటమితో ఎదురొడ్డి నిలిచి 13 కౌన్సిలర్ స్థానాలను సాధించామని మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్న దొర అన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం తన క్యాంప్ కార్యాలయంలో గెలిచిన, ఓడిన సభ్యులతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసినప్పటికీ కొన్ని కారణాలవల్ల కాస్త వెనకబడ్డామని అయితే గౌరవప్రదంగా 13 వార్డులను వైఎస్సార్‌సీపీ గెలుచుకోవడం సంతోషకరమన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే పార్టీకి ఓట్ల శాతం పెరిగిందని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మున్సిపాలిటీలో కూటమికి 12,000పై చిలుకు ఓట్ల మెజారిటీ వచ్చిందని ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ 6000 పైచిలుకు తగ్గిందన్నారు. ఈ విషయంలో పార్టీ బలోపేతంగా ఉందన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు అధైర్య పడకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ప్రతి వార్డు నుంచి నాయకులను సంప్రదించి స్థానికంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే డాక్టర్ శామ్యూల్ మాట్లాడుతూ చైర్‌పర్సన్ అభ్యర్థి రిబ్కా రాణి గెలుపు కోసం పనిచేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఓటమికి కారణాలు తెలుసుకుని రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకులను కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు పుండరీకాక్షనాయుడు గెలిచిన కౌన్సిలర్లతో పాటు ఓడిన అభ్యర్థులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


