డొంగసొరడ పాఠశాలకు తాళం | - | Sakshi
Sakshi News home page

డొంగసొరడ పాఠశాలకు తాళం

Nov 6 2026 2:20 AM | Updated on Nov 6 2026 2:20 AM

పాఠశాల గేటు వేసి నిరసన తెలుపుతున్న గ్రామస్తులు

రాయగడ: హాస్టల్‌ నుంచి అదృశ్యమైన ఆరో తరగతి విద్యార్థి కునాల్‌ సబర్‌ ఆచూకీ మూడు నెలలైనా ఇంకా లభించకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు డంగసొరడ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఆశ్రమ పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. విద్యార్థి ఆచూకీ కనుగొనడంలో పోలీసులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ యుగాపదర్‌ గ్రామస్తులు పాఠశాల గేటుకు తాళం వేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని చంద్రపూర్‌ సమితి పరిధి యుగాదపర్‌ గ్రామానికి చెందిన దివంగత మనోజ్‌ సబర్‌ కుమారుడు కునాల్‌ సబర్‌ (12) డంగసొరడ ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఆ బాలుడు ఈ ఏడాది జూలై 31వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. అయితే విద్యార్థి అదృశ్యమైన విషయాన్ని పాఠశాల అధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేయలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఆరు రోజుల తర్వాత బాలుడు హాస్టల్‌ నుంచి కనిపించకుండా పోయిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పాఠశాల హెచ్‌ఎంను ప్రశ్నించారు. అక్కడి నుంచి సంతృప్తికరమైన సమాధానం లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఇంతవరకు కునాల్‌ ఆచూకీ లభించలేదు. మూడు నెలలుగా బాలుడి కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. విద్యార్థి ఆచూకీ లభించేవరకు పాఠశాలకు తాళం వేసి కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొన్న సమాచారం అందుకున్న ఎస్‌డీపీవో సంతోషిని ఒరం, మునిగుడ పోలీస్‌స్టేషన్‌ ఐఐసీ లలిత్‌ సాగర్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్తులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పాఠశాల తాళాన్ని గ్రామస్తులు తెరిచారు. పాఠశాల హెచ్‌ఎం, ఇతర సిబ్బందిని సమగ్రంగా విచారించకపోవడం వల్లే విద్యార్థి ఆచూకీ లభించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సంక్షేమ శాఖ అధికారి ఆసీమా రావ్‌ను మీడియా ప్రతనిధులు ప్రశ్నించగా, విద్యార్థి ఆదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు అందిందని, ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారం పూర్తిగా పోలీసులు విచారణపై ఆధారపడి ఉందని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement