● వీక్షించిన భక్తజనం
● బాణసంచా మిరమిట్లు నడుమ
పెద్దచెరువులో విహరించిన అమ్మవారు
● పైడిమాంబకు జేజేలు పలికిన భక్తులు
విజయనగరం (కల్చరల్) క్రైమ్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, విజయనగరం ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి తెప్సోత్సవం మంగళవారం కనుల పండువగా సాగింది. వేద మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాలు నడుమ పైడితల్లి అమ్మవారు హంసవాహనంలో మూడుసార్లు విహరించారు. తొలుత వనంగుడిలో పండితులు వేదపఠనం గావించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. అమ్మవారిని అలంకరించాక పల్లకిలో ఉంచి వనంగుడి నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా పడమర ఉన్న పెద్ద చెరువులో సిద్ధంగా ఉన్న హంసవాహనంలో ఉంచి సాయంత్రం 05.40 గంటల సమయంలో తెప్పోత్సవం నిర్వహించారు. సీఎంఆర్, రామానాయుడు రోడ్, ఎం.ఆర్.కాలేజ్, టెలిఫోన్‌భవన్ రోడ్ వైపుగా చెరువులో అమ్మవారు విహరించారు. అమ్మవారి తెప్పోత్సవాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. బాణసంచా మిరమిట్లు నడుమ చెరువులో విహరిస్తున్న అమ్మవారికి జేజేలు పలికారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ లక్ష్మణమూర్తి, వన్‌టౌన్ సీఐ చౌదరి, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వేదపఠనం చేసిన పండితులకు ఆలయ అధికారులు సత్కరించారు. కార్యమ్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు పాల్గొన్నారు.


