నేడే పురఫలితాలు | - | Sakshi
Sakshi News home page

నేడే పురఫలితాలు

Nov 3 2026 2:21 AM | Updated on Nov 3 2026 2:21 AM

● మున్సిపల్‌ ఓట్ల లెక్కింపునకు

ఏర్పాట్లు పూర్తి

● పీఠం ఎవరిదో తేలే క్షణం..

సాక్షిప్రతినిధి,విజయనగరం: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు వేళయింది. నగరం, పట్టణాల అధికార పీఠాన్ని ఏ పార్టీ కై వసం చేసుకుంటుందో, ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో తేల్చే నిర్ణయాత్మక ఘడియలు వచ్చేశాయి. కొన్నివారాలుగా నిద్రలేని రాత్రులు గడుపుతూ సుదీర్ఘ ప్రచార పర్వాన్ని ముగించుకున్న అభ్యర్థుల గుండెల్లో కౌంటింగ్‌ గంట మోగుతున్న కొద్దీ దడపెరుగుతోంది. ఉదయం నుంచే కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు వేగవంతంగా సాగనుండగా, సాయంత్రం 5 గంటల నాటికి నగరపాలక పీఠం ఎవరిదో పూర్తి స్పష్టత రానుంది.

ఉత్కంఠత..

సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకోవడంతో విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సర్వత్రా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. నగరంలో మొత్తం 2,23,050 మంది నమోదిత ఓటర్లు ఉండగా, అందులో 1,39,929 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించారు. ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో నగర మేయర్‌ పీఠం కోసం మొత్తం ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలవగా, నగరంలోని 62 డివిజన్ల పరిధిలో బరిలోకి దిగిన కార్పొరేటర్‌ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరి భవితవ్యమంతా ప్రస్తుతం కౌంటింగ్‌ కేంద్రాల్లోని బ్యాలెట్‌ పెట్టెలలోనే నిక్షిప్తమై ఉంది. 1.39 లక్షల మంది ఓటర్లు ఇచ్చిన తీర్పు సాయంత్రానికి వెల్లడికానుండడంతో ప్రతి డివిజన్‌లోని అభ్యర్థుల్లో ఆందోళన, ఆసక్తి పరాకాష్ఠకు చేరాయి.

ఎవరి ధీమా వారిదే...

విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పోరుపై రాజకీయ విశ్లేషకులు కూడా ఒక కచ్చితమైన అంచనాకు రాలేకపోతున్నారు. అధికార పక్షానికి ఎక్కడా తగ్గకుండా ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంతే ధీటుగా పోటీ ఇచ్చినట్లు క్షేత్రస్థాయి విశ్లేషణలు చెబుతున్నాయి. విజయావకాశాలు చాలా తక్కువ ఓట్ల వ్యత్యాసంతోనే తేలనున్నాయని, స్వల్ప ఆధిక్యతతోనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయని అంచనా వేస్తున్నారు. కౌంటింగ్‌ చివరి రౌండ్‌ వరకు విజేత ఎవరనేది ఊహించడం కష్టమేనని, ఒక్కో ఓటు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. పోలింగ్‌ నాటి నుంచే నగరంలో రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు వాడవాడలా ఎవరి గెలుపుపై వారు ధీమా వ్యక్తం చేస్తుండగా, సామాన్య పురప్రజలు మాత్రం ఫలితాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు భారీ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలలోపే నగరానికి రాబోయే కొత్త మేయర్‌ ఎవరు, 62 డివిజన్లను ఏ పార్టీ కై వసం చేసుకుంటుంది అనేది పూర్తిస్థాయిలో తేలిపోనుంది.

లెక్కింపు ఇలా...

విజయనగరం అర్బన్‌/విజయనగరం: మున్సిపల్‌ ఎన్నిక ఫలితాలు వెల్లడికి రంగం సిద్ధమైంది. విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయితీల్లో ఓట్ల లెక్కింపు, ఫలితాలు త్వరిత గతిన వెల్లడించేందుకు ప్రత్యేక కౌంటింగ్‌ టేబుళ్లు, సిబ్బందిని నియమించారు. ప్రతి టేబుల్‌కు నలుగురు సిబ్బంది చొప్పున విధులు కేటాయించారు.

మూడు చోట్ల మూడు రకాలుగా...

విజయనగరం నగరపాలక సంస్థ ఓట్లను రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలోను, నెల్లిమర్ల నగర పంచాయతీ ఓట్లను సీకేఎం జూనియర్‌ కళాశాలలోను, బొబ్బిలి మున్సిపాలిటీ ఓట్లను గ్రోత్‌సెంటర్‌లోని ఏపీఐఐసీ భవనంలో చేపట్టనున్నారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో మేయర్‌ అభ్యర్థుల ఓట్ల లెక్కింపునకు 31 టేబుళ్లు, 62 డివిజన్ల కార్పొరేటర్‌ అభ్యర్థుల ఓట్ల లెక్కింపునకు మరో 31 టేబు ళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 62 కౌంటింగ్‌ కంపార్ట్‌మెంట్లలో లెక్కింపు నిర్వహించనున్నాను. రెండు రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయ్యే అవకాశం ఉంది. బొబ్బిలి మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఓట్ల లెక్కింపునకు 9 టేబుళ్లు, 36 వార్డుల కౌన్సిలర్‌ అభ్య ర్థుల ఓట్ల లెక్కింపునకు మరో 9 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం నాలుగు రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. నెల్లిమర్ల నగర పంచాయతీలో చైర్మన్‌ అభ్యర్ధి ఓట్ల లెక్కింపునకు నాలుగు టేబుళ్లు, 23 వార్డుల కౌన్సిలర్‌ అభ్యర్థుల ఓట్ల లెక్కింపునకు మూడు టేబుళ్లు సిద్ధం చేశారు. ఇక్కడ ఆరు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించనున్నారు.

కట్టుదిద్దమైన భద్రత... నిరంతర నిఘా

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుండా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. కౌంటింగ్‌ హాళ్లలోకి సెల్‌ ఫోన్లు, ఆహార పదార్థాలు, పానీయాలు, వాటర్‌ బాటిళ్లకు అనుమతి లేదు. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద జరిగే ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయనున్నారు. ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యే వరకు విరామం లేకుండా లెక్కింపు కొనసాగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement