ప్రచారం ముగిసింది.. పంచడం మిగిలింది! | - | Sakshi
Sakshi News home page

ప్రచారం ముగిసింది.. పంచడం మిగిలింది!

Oct 31 2026 8:13 AM | Updated on Oct 31 2026 8:13 AM

● ఓటర్లకు టీడీపీ ప్రలోభాలు

● మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఫండ్స్‌ రిలీజ్‌

● పెన్షన్లు పంపిణీ చేస్తూనే అధికారులతో ప్రచారం

సాక్షిప్రతినిధి, విజయనగరం: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. నాయకుల హామీలు.. వాగ్దానాలు.. పెద్దపెద్ద మాటలు.. వాద ప్రతివాదాలు.. ఆరోపణలు.. విమర్శలు.. ఒకరి మీద ఒకరు బురద పోసుకోవడాలు.. ఛాలెంజులు.. సవాళ్లు.. ఒకటా రెండా.. ఇలాంటివన్నీ ముగిశాయి. అధికారులు ఎన్నికల నిబంధనల మేరకు మైకులకు.. ప్రచార రథాలకు.. నాయకుల నోళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. నోటికి తాళం వేస్తే చేతులు ఊరుకుంటాయా ఏంటి.. సరిగ్గా ఇప్పుడే చేతులకు పని చెబుతున్నారు. వార్డులు.. వీధులు.. పెద్ద పెద్ద కుటుంబాలను.. వాళ్లను ప్రభావితం చేసే వ్యక్తులను జల్లెడపట్టి ఓటుకు ఇంతని లెక్కగట్టి డబ్బు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్లు ఒక అడుగు ముందుకు వేసి వార్డుల వారీగా డబ్బు పంపిణీకి ఇన్‌చార్జిలను నియమించినట్టు సమాచారం. దీనికి తోడు పోలీసులు.. రెవెన్యూ అధికారులు సైతం వారికి సహకారం అందిస్తుండడంతో వారి ఆగడాలకు.. పంపకాలకు అడ్డంకి లేకుండా పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విజయనగరం కార్పొరేషన్‌, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలు, నెల్లిమర్ల, పాలకొండ, నగర పంచాయతీలకు నవంబర్‌ 1న ఎన్నికలు జరగనుండడంతో ఇప్పటికే ఆయా వార్డులను.. ప్రతి గుమ్మాన్ని టచ్‌ చేసిన టీడీపీ నాయకులు.. అభివద్ధి మాటలు చెప్పి ఓట్లను కొల్లగొట్టేందుకు అన్ని ఎత్తులూ వేస్తున్నారు. ఓట్లను బట్టి గంపగుత్తగా బేరాలు ఆడుతూ ఓటుకు రూ.1000 నుంచి రూ.2000 వరకు చెల్లించేందుకు ఏర్పాట్లు నడుస్తున్నాయి. దీనికితోడు వార్డుల్లో భోజనాలు.. చోటా మోటా నాయకులకు రాత్రిపూట మద్యమాంసాలతో విందు వినోదాలు కూడా నడుస్తున్నాయి.

పెన్షన్ల పేరిట కొత్త ప్రచారం

నవంబర్‌ ఒకటో తేదీన మున్సిపల్‌ ఎన్నికలు ఉండడంతో పోలింగ్‌ రోజున పెన్షన్లు పంపిణీకి ఇబ్బందులు తలెత్తుతాయన్న నెపంతో ప్రభుత్వం అక్టోబర్‌ 30న పెన్షన్లు పంపిణీ చేసింది. ఇదే తరుణంలో ఓట్లు వేయాలని ఉద్యోగులతో చెప్పించడం ద్వారా గోడచాటు ప్రచారాన్ని నడిపిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశానికి ఓట్లు వేయకపోతే పెన్షన్లు తొలగించే ప్రమాదం ఉందని బెదిరిస్తున్నారు. మొత్తానికి ఎన్నికలవేళ తెలుగుదేశం వారు ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ తొక్కుతూ ఓటర్లను మభ్యపెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్ముందు కొత్త పథకాలు ఇస్తామని.. ఓటు వేయకుంటే ఉన్నవి తొలగిస్తామని బ్లాక్‌మెయిల్‌ కూడా చేయడం గమనార్హం. మొత్తానికి ప్రజలు గత వైఎస్‌ జగన్‌ పాలనతో ఇప్పటి చంద్రబాబు పాలనను... పెరిగిన నిత్యావసరాల ధరలను పోల్చుకుని అన్నిటినీ మనసులో దాచుకుని ఓట్లను గుప్పట్లో పట్టుకుని పోలింగ్‌ రోజు కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement