విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి పత్రికా స్వేచ్ఛను పూర్తిగా కాలరాస్తూ, నిరంకుశంగా విలేకరులపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని విజయనగరం జిల్లా జర్నలిస్టు యూనియన్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులను టార్గెట్ చేసి భౌతిక దాడులకు పురిగొల్పడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇటీవల కర్నూలు జిల్లా ఆత్మకూరులో సాక్షి రూరల్ విలేకరి సుబ్బారెడ్డిపై కొందరు గుర్తుతెలియని దుండగులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరచడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలంటూ జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) సీహెచ్ సత్తిబాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఎం.ఎస్.ఎన్.రాజు, ఏపీయూడబ్ల్యూజే డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి.ఎస్.వి.శివప్రసాద్, సాక్షి బ్యూరో ఇన్‌చార్జి కె.గాంధీ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సన్యాసిరావు, సీనియర్ జర్నలిస్టులు ప్రాతో బెహరా, డేవిడ్ రాజు, మంత్రిపాగడ రవికుమార్, వై.ఎస్.పంతులు, పంచాది అప్పారావు, కె.జె.శర్మ, ఏపీయూడబ్ల్యూజే అర్బన్ కమిటీ సభ్యులు, సాక్షి జర్నలిస్టులతో పాటు జిల్లాలోని వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంలో పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు..
విలేకరి సుబ్బారెడ్డిపై దాడికి నిరసనగా
జర్నలిస్టు యూనియన్ల ఆందోళన
జర్నలిస్టుల రక్షణకు చట్టం చేయాలని డిమాండ్
డీఆర్వో సీహెచ్ సత్తిబాబుకు వినతిపత్రం
అందజేత


