విజయనగరం రూరల్: జిల్లా కేంద్రం శివారున గల కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉక్కు మనిషి, స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని సీటీయూలో నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవంలో ముందుగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సీటీయూ ఇన్‌చార్జి ఉపకులపతి టి. శ్రీనివాసన్ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడడంలో ప్రతి పౌరుడికి బాధ్యత ఉందని, భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అని పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దేశంలోని సంస్థానాలను ఏకీకృతం చేసి జాతీయ సమైక్యతకు బలమైన పునాది వేశారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్ జితేంద్ర మోహన్ మిశ్రా మాట్లాడుతూ జాతీయ ఐక్యత అనేది కేవలం ఒకరోజు నిర్వహించే కార్యక్రమానికి పరిమితం కాకుండా ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని పేర్కొన్నారు. కుల, మత, భాష, ప్రాంతీయ భేదాలకు అతీతంగా పరస్పర గౌరవం, సోదరభావం, ఐక్యతతో ముందుకు సాగినప్పుడే బలమైన దేశ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. గ్రంథాలయాధికారి డా.శంకర్ రెడ్డి కొల్లే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి డా.సురేష్ బాబు కలిదిండి, విద్యార్థి సంక్షేమ విభాగం డీన్ బొంతు కోటయ్య, ఓఎస్‌డీలు తారకేశ్వరరావు, లతా కల్యంపూడి, పి. శ్రీదేవి, అప్పాసాబా, ఎన్‌వీఎస్. సూర్యనారాయణ, దివ్య, ప్రమ, కుసుమ, గంగు నాయుడు పాల్గొన్నారు.


