శృంగవరపుకోట: సౌత్‌జోన్ కరాటే పోటీల్లో మొహంతిస్ కౌముది గ్లోబల్ స్కూల్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. విశాఖపట్నం వేదికగా అక్టోబర్ 25న నిర్వహించిన 5వ కియో సౌత్‌జోన్ కరాటే చాంపియన్ షిప్ 2026 (5వ కియో సౌత్ జోన్ కరాటే చాంపియన్‌షిప్)లో మొహంతిస్ కౌముది గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. దాదాపు 2,600 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక పోటీలలో పాఠశాల విద్యార్థులు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను కై వసం చేసుకున్నట్లు ప్రిన్సిపాల్ శాంతి మొహంతి చెప్పారు. 4వ తరగతి విద్యార్థి ఎ.తేజస్వరూప్–స్వర్ణపతకం, 7వ తరగతి విద్యార్థి వి.హార్ధిక్ వినయ్–రజత పతకం, 3వ తరగతి విద్యార్థిని కె.సుదీక్ష కాంస్యపతకం సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన కరాటే కోచ్ శ్రీనివాసరావును, పతకాలు సాధించిన క్రీడాకారులను పాఠశాల ప్రిన్సిపాల్ శాంతి మొహంతి అభినందించారు.


