● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు
విజయనగరం: మరో మూడు రోజుల్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు విమర్శించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అనుసరిస్తున్న విధానం సరైనది కాదని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులను నిర్బంధించడం, నామినేషన్ వేసేందుకు వెళ్లిన వారి పత్రాలను చించివేయడం, కర్రలు/బండరాళ్లతో హత్యలు చేసేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తగదన్నారు. జిల్లాలో జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన సిరిసహస్రకు తండ్రి ముఖేష్ జైన్ వారసత్వం ప్రకారం ఆమెను ఓసీగా పరిగణించాల్సింది పోయి బీసీడీగా ఎలా ధ్రువీకరిస్తారని ప్రశ్నించారు. ఇదే విషయంలో ప్రస్తుతం మజ్జి సిరిసహస్ర పేరుతో తెర్లాం జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న ఓసీ అభ్యర్థినిపై వైస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థి బొమ్మిడి శ్రీనివాసరావు ఫిర్యాదు చేస్తున్నా అధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ప్రజాస్వామ్య భారత దేశంలో ఎవరైనా పుట్టిన సమయంలో వారసత్వంగా వచ్చిన కులం తప్ప ..దత్తత తీసుకున్న తరువాత వేరే కులం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పునిచ్చిందన్నారు. అయితే అధికార యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముకాసేలా ఓసీ అభ్యర్థిని, బీసీగా పోటీ చేస్తున్నట్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల కాలరాయడమేనని తెలిపారు.
చైతన్య నామినేషన్ ఎలా తిరస్కరించారు?
ఇదిలా ఉండగా..పూసపాటిరేగ మండలం నుంచి జెడ్పీటీసీ అఽభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన బొత్స చైతన్యకు పట్టణ పరిధిలో ఓటు హక్కు ఉందంటూ సాంకేతిక కారణాలు చెప్పి నామినేషన్‌ను తిరస్కరించడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. చీపురుపల్లి మండలం కోడూరు గ్రామానికి తన ఓటు హక్కును బదలాయించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా..సదరు న్యాయమూర్తి అలా చేయాలంటూ ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడం దారుణమన్నారు. ధర్మబద్ధంగా వెళ్తున్న వైఎస్సార్‌సీపీ, అధర్మంగా వెళ్తున్న అధికార కూటమి పార్టీలకు మధ్య జరుగుతున్న ఎన్నికల్లో అధికారయంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పని తీరును గమనిస్తే ఓట్లు దొంగతనం చేసే కుట్ర పన్నుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇప్పటికై నా అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లుకు తలొగ్గకుండా స్వేచ్ఛగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.


