వీరఘట్టం: స్కానింగ్ కేంద్రాలు వైద్యారోగ్యశాఖ నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్రీయ బాల స్వాస్ధ్య కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ టి.జగన్‌మోహన్‌రావు స్పష్టం చేశారు.స్కానింగ్ కేంద్రాల తనిఖీల్లో భాగంగా గురువారం ఆయన వీరఘట్టంలోని కనోసా ఆస్పత్రిలో గల స్కానింగ్ కేంద్రాన్ని వైద్యబృందంతో కలిసి తనిఖీ చేశారు. స్కానింగ్ యంత్రం రిజిస్ట్రేషన్, రెన్యువల్ ధ్రువీకరణ పత్రాలు, ప్రతినెలా నిర్వహించే గర్భిణుల స్కానింగ్ వివరాల రికార్డులు, దస్త్రాలు పరిశీలించారు. స్కానింగ్ నిబంధనల బోర్డు, రుసుము వివరాలు.టోల్‌ఫ్రీ నంబర్ పరిశీలించి సూచనలు చేశారు. గర్భిణులకు నిర్వహించే స్కానింగ్ వివరాలు 21 కాలమ్స్‌తో కూడిన ఫారం–ఎఫ్‌లో పొందుపరిచి జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయానికి నివేదించాలని ఆదేశించారు.రికార్డులు ఎప్పటికప్పుడు సరైన సమాచారంతో నమోదు చేయాలని సూచించారు. నిర్ణీతకాలం కాలవ్యవధిలో రెన్యువల్ పూర్తి చేసుకోవాలని, స్కానింగ్ యంత్రాంగాన్ని, వైద్యులు, సిబ్బందిని మార్పు చేసిన యెడల ఆరోగ్యశాఖకు తెలియాలని సూచించారు. గర్భంలో శిశు ఆరోగ్య స్థితి, అసాధారణతలు తెలుసుకునేందుకు స్కానింగ్ ఉద్దేశమని, చట్టప్రకారం లింగ నిర్ధారణ నేరమని తెలియజేశారు. ఎక్కడైనా అట్టి చర్యలకు పాల్పడితే టోల్‌ఫ్రీ నంబర్ 18002332447కు తెలియజేయాలని యాక్ట్ ప్రకారం తగుచర్యలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు వైద్యారోగ్యశాఖ డిప్యూటీ డెమో డి.వి.గిరిబాబు, వైద్యాధికారి ప్రదీప్ తదితరులు ఉన్నారు.
జిల్లా ఆర్‌బీఎస్‌కే అధికారి డా.జగన్‌మోహన్


