సాలూరు: ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద కొటి యా గ్రూపు గ్రామాల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ప్రముఖులు మంగళవారం పర్యటించారు. కాంగ్రెస్ వాస్తవ పరిశీలన బృందం కొటియా, నేరెళ్లవలస తదితర గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. పర్యటించిన వారిలో ఒడిశా ఎంపీ, ఎమ్మెల్యేలు సప్తగిరి గిరిశంకర్, రామచంద్ర కదమ్, తారా ప్రసాద్ బహినీపతి, పీటా సావంత, మంగు ఖిల్, కద్రక అప్పలస్వామి, నీలమాధవ్ హిక్క తదితరులు ఉన్నారు.
వివాహిత అనుమానాస్పద మృతి
గజపతినగరం రూరల్: పాత శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన కొర్నాన ఈశ్వరమ్మ (21) మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందింది. ఉదయం 11.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఈశ్వరమ్మ ఉరి వేసుకున్నట్టు సమాచారం. ఈశ్వరమ్మకు సుమారు మూడేళ్ల క్రితం బెల్లాన లక్ష్మునాయుడుతో ప్రేమ వివాహం కాగా, గత తొమ్మిది నెలలుగా ఇద్దరూ విడిగా ఉంటున్నట్లు తెలిసింది. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేయాల్సి ఉంది.
వ్యక్తికి తీవ్ర గాయాలు
పార్వతీపురం రూరల్: టౌన్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ట్రైన్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన వారు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బాధితుడి వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. అతడి కుడి చేతిపై సిలువ గుర్తు, ఎడమ చేతిపై కరుణ అని పేరు రాసి ఉంది. ఈ ఘటనపై హెచ్‌సీ రత్నకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


