విజయనగరం అర్బన్: జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 30న జిల్లా స్థాయి రోల్‌ప్లే, జానపద నృత్య పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యం నాయుడు, డైట్ ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు స్థానిక జిల్లా విద్యాశిక్షణ సంస్థ (డైట్) ప్రాంగణంలో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో తుఫాన్ పరిస్థితుల నేపధ్యంలో అక్కడి విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని పార్వతీపురం కళావేదికలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోల్‌ప్లే పోటీల్లో ఒక్కో జట్టులో నలుగురు నుంచి ఐదుగురు, జానపద నృత్య పోటీల్లో ఐదుగురు నుంచి ఆరుగురు విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. రోల్‌ప్లేలో పాల్గొనే విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాల యూనిఫాం ధరించాలని, జానపద నృత్య పోటీలకు సంప్రదాయ దుస్తులు ధరించవచ్చని వెల్లడించారు. పోటీలకు సంబంధించిన థీమ్‌ల వివరాలను ‘ఎన్‌పీఈపీఎన్‌సీఈఆర్‌టీ.ఐఎన్’ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని, ఆసక్తిగల విద్యార్థులు అదే వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు విజయనగరం జిల్లా నోడల్ అఽధికారి డి.శ్రీనివాస్ (ఫోన్:944085755), పార్వతీపురం మన్యం జిల్లా నోడల్ అధికారి ఎ.శశిభూషణరావు (8500042742)ను సంప్రదించాలని తెలిపారు.
పైడితల్లి సేవలో వైఎస్సార్ సీపీ నేతలు
విజయనగరం గంటస్తంభం/విజయనగరం క్రైమ్: జిల్లా కేంద్రంలో పైడితల్లి సిరిమానోత్సవానికి వివిధ ప్రాంతాల వైఎస్సార్ సీపీ నాయకులంతా మంగళవారం తరలివెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని వేడుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అప్పలనరసయ్య, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి కోలగట్ల శ్రావణి, యువ నాయకుడు కౌశిక్ తదితరులు ఉన్నారు.


