సాక్షి ప్రతినిధి, విజయనగరం:
ఒకప్పుడు గజపతినగరంలో హవా సాగించిన వాళ్లంతా ఇప్పుడు తెరవెనక్కి వెళ్లిపోతున్నారు. గత టీడీపీ హయాంలో హవా సాగించిన కొండపల్లి అప్పలనాయుడు నేడు పూర్తిగా ఉనికిని కోల్పోయారు. నియోజకవర్గంలో, కాపు సామాజికవర్గంలో పట్టున్న నాయుడు ఇప్పుడు తన అన్నకొడుకు హవాను తట్టుకోలేక, తన ఉనికిని కాపాడుకోలేక, తన వెంట నడిచిన వారికి కనీస గుర్తింపు ఇప్పించుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
నియోజకవర్గంలో తనకంటూ కొంత కేడర్‌ను మెయింటెయిన్ చేస్తున్న అప్పలనాయుడు అంటే ఆయన అన్న కొండబాబుకు, ఆయన కుమారుడు, మంత్రి శ్రీనివాస్‌కు అసలు గిట్టడం లేదు. దీంతో ఆయనకు గజపతినగరంలో రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యం దక్కకుండా పావులు కదుపుతూ నియోజకవర్గంలో టీడీపీ అంటే మంత్రి అనేలా పార్టీని అజమాయిషీ చేస్తూ వస్తున్నారు. ఈ సంకెళ్లను తెంచుకోవడానికి .. తనకున్న ప్రాబల్యం చూపడానికి అప్పలనాయుడు ఎన్నోవిధాలా ప్రయత్నిస్తున్నా సాధ్యపడడంలేదన్న చర్చ సాగుతోంది. తనవాళ్లకు కొన్ని అయినా నామినేటెడ్ పదవులు వస్తాయనుకుంటే అవి కూడా దక్కలేదు. ఇక స్థానిక సంస్థల పదవుల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ వంటి స్థానాల కేటాయింపులోనూ కనీసం తన మాట వినకపోవడం అప్పలనాయుడిని తీవ్రంగా అవమానపరిచినట్లు అయింది.
ఆయన తాలూకా అంటే అంతే...
అప్పలనాయుడు తాలూకా.. ఆయన అనుచరుడు అనే ముద్ర, గుర్తింపు పడితే చాలు వారి పొలిటికల్ కెరీర్ ఫసక్ అయిపోతోంది. జెడ్పీటీసీగా ఆశావహుడైన బొండపల్లికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బండారు బాలాజీ, గంట్యాడ మండలానికి చెందిన చెందిన కొండపల్లి భాస్కర్ నాయుడు, ఎంపీపీ ఆశావహులైన దత్తిరాజేరు మండలానికి చెందిన బెజవాడ బంగారు నాయుడు, గంట్యాడ మండలానికి చెందిన గొర్రెపాటి శ్రీనివాసరావు ఇప్పుడు స్థానిక సంస్థల లిస్ట్‌లో అడ్రస్ లేకుండా పోయారు. వీళ్లంతా కొండపల్లి అప్పలనాయుడి వర్గీయులుగా గుర్తింపు పొందడమే కారణమని అంటున్నారు. కార్పొరేషన్ పదవులు ఇవ్వకపోయినా కనీసం స్థానిక సంస్థలలో అయినా అవకాశం వస్తుందని ఎదురు చూసిన తెలుగుయువత పార్లమెంట్ అధ్యక్షుడు వేమలి చైతన్య బాబు వంటివారు ప్రతిపక్షంలో ఉంటూ పార్టీకోసం పని చేశారు. తీరా అధికారం వచ్చేసరికి అయినవాళ్లు కాదంటూ వీరిని పక్కనపెట్టేశారు.
మంత్రిగారు.. మీకిది తగునా..
బొండపల్లి: సుధీర్ఘ కాలంగా టీడీపీ కోసం పనిచేస్తున్నాను.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచాను.. తను జెడ్పీటీసీగా, తన అక్క కృష్ణవేణి ఎంపీపీగా పనిచేశాం... ఇంతకంటే పార్టీ బ్యాక్ గ్రౌండ్ ఏం కావాలి... మీరు రాకముందే నేను రాజకీయాల్లో ఉన్నాను.. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు, నాయకులను సంప్రదించకుండా, ఏకపక్షంగా బొండపల్లి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వకుండా పక్కకు తన్నేస్తారా... మంత్రిగారూ ఇదేనా మీ నీతి అంటూ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు బండారు బాలాజీ కన్నీరుపెట్టారు. మంత్రి ఎదుటే గురువారం తనకు జరిగిన ఆవేదనను వ్యక్తంచేశాడు. మంత్రి నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులకు ప్రాధాన్యం లేదంటూ తన శ్రేణులతో కలిసి వెనుదిరిగారు.
మరోవైపు ఓసారి ఎంపీపీ, రెండుసార్లు జెడ్పీటీసీగా పని చేసిన మక్కువ శ్రీధర్‌ను కూడా మంత్రి మెల్లగా సైడ్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. గజపతినగరం ఎంపీపీ బీసీ జనరల్‌కు రిజర్వ్ అయింది కాబట్టి ఆ స్థానం తనకు ఇవ్వాలని శ్రీధర్ మంత్రిని కోరగా అలా కుదరదని చెప్పినట్లు తెలిసింది. తన బంధువు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా రాష్ట్రస్థాయి పదవిలో ఉన్న శ్రీదేవికి ఆ పోస్టులో పెట్టేందుకు మంత్రి నిర్ణ యం తీసుకున్నారు. గజపతినగరం జెడ్పీటీసీ స్థానం ఓసీ మహిళకు రిజర్వ్ కావడంతో అక్కడ శ్రీధర్ భార్య ఉషను పోటీలోకి దింపాలని మంత్రి సూచించారు. జనరల్‌గా ఉన్న ఎంపీపీ స్థానంలో మంత్రి బంధువైన శ్రీదేవిని నిలబెట్టడం ఏమిటి..? మహిళా కోటాగా ఉన్న జెడ్పీటీసీ స్థానం తనకి ఇవ్వడం ఏమిటని శ్రీధర్ లోలోన మదనపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీధర్‌ను పార్టీలో చేర్చుకున్నపుడు ‘నువ్వు నా కొడుకులాంటోడివి.. మా వాడికి అనుభవం లేదు.. నువ్వే కాస్త చూసుకోవాలి.. నీ భవిష్యత్తు నేను చూసుకుంటా ‘ అంటూ శ్రీనివాస్ తండ్రి కొండబాబు చెప్పిన మాటలు చెవుల్లో రీ సౌండ్ వస్తుండగా, భార్య ఉషతో కలిసి నామినేషన్‌కు బయలుదేరుతున్నారు.
మంత్రి ఏకపక్ష నిర్ణయాలు...
కేడర్‌లో అయోమయం
కొండపల్లి అప్పలనాయుడు టీమ్‌కు
సీట్ల కేటాయింపులో వివక్ష
స్కెచ్‌వేసి మరీ టార్గెట్ చేసిన
మంత్రి పేషీ


