విజయనగరం రూరల్: జేఎన్‌టీయూ జీవీలో ఏర్పాటుచేసిన స్థానిక సంస్థల ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ గురువారం తనిఖీ చేశారు. జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేయనున్న విజయనగరం, జామి, గంట్యాడ, బొండపల్లి మండలాల మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కళాశాల ప్రాంగణం నుంచి పై అంతస్తులో ఉన్న కౌంటింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించేదుకు హమాలీలను ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ ఏజెంట్లు, ఎన్నికల సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆర్డిఓకు సూచించారు. కార్యక్రమంలో విజయనగరం ఆర్డీఓ సుధాసాగర్, డీఎస్పీ లక్ష్మణమూర్తి, తహసీల్దార్ హేమంత్ కుమార్, ఎన్నికల అధికారులు, జేఎన్‌టీయూ అధికారులు పాల్గొన్నారు.
2,3 తేదీల్లో స్థానిక సెలవులు
● ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ ఉత్తర్వులు
● పోలింగ్ ప్రాంతాల్లో 48 గంటలు వైన్స్ బంద్
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో నవంబర్ 2,3 తేదీల్లో స్థానిక సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలుగా వినియోగించే ప్రభుత్వ, విద్యా సంస్థల భవనాలకు నవంబర్ 2,3వ తేదీల్లో రెండు రోజుల పాటు సెలవు వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే నవంబర్ 3న పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు అమల్లో ఉంటుందని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ప్రైవేటు సంస్థలు సైతం సహకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం పరిధిలోకి వచ్చే దుకాణాలు, కార్మికులకు నవంబర్ 3న వేతనంతో కూడిన సెలవు(పెయిడ్ హాలిడే) ఇవ్వాలని స్పష్టం చేశారు. మరోవైపు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు వీలుగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో నవంబర్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వరుసగా 48 గంటల పాటు మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేయాలని ఎకై ్సజ్‌శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.


