● భక్తిశ్రద్ధలతో రథాల తయారీ
విజయనగరం కలర్చల్(క్రైమ్): ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. జాతరలో అత్యంత ప్రధాన ఘట్టమైన సిరిమానుతో పాటు రథాల తయారీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. విజయనగరంలోని హుకుంపేట వేదికగా భక్తిభావం ఉట్టిపడేలా ఈ పనులను అత్యంత నిష్టతో చేపడుతున్నారు.
అంతా అమ్మ దయ..
ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరిగే ఈ ఉత్సవాల వెనుక అంకితభావంతో పనిచేస్తున్న శిల్పుల శ్రమ ఎంతో ఉంది. నాలుగు దశాబ్దాలుగా రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన శిల్పి కనిమెల్ల రమణ పైడితల్లి అమ్మవారి సిరిమాను, రథాల తయారీ బాధ్యతలను భుజాన వేసుకుంటున్నారు. 2015 నుంచి సిరిమాను రూపకల్పనలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన, అంతా ఆ అమ్మ దయవల్లే జరుగుతోందని వినమ్రంగా చెబుతున్నాడు.
● శిల్పి కనిమెల్ల రమణ ఆధ్వర్యంలో పదిమంది సభ్యుల బృందం ఈ పనులను పకడ్బందీగా చేపడుతోంది. సంప్రదాయ పద్ధతిలో రథాలను తీర్చిదిద్దుతున్నారు.
● గతంలో 2024వ సంవత్సరంలో ప్రత్యేకంగా గుగ్గిలం కర్రను ఉపయోగించి ఏనుగు రథం, అంజలి రథాలను అద్భుతంగా తయారు చేశారు. ఈ పనులన్నీ చేసే సమయంలో శిల్పులు ఎంతో నిష్టను పాటిస్తూ, తయారీ రోజుల్లో కటిక ఉపవాసంతో ఉంటూ అమ్మవారి పట్ల తమ అంకితభావాన్ని చాటుకుంటున్నారు.
హుకుంపేటలో మూడు రథాల రూపకల్పన
జాతరలో తిరిగే మూడు రథాల నిర్మాణ పనులను హుకుంపేటలో స్థానిక కళాకారులు, సిబ్బందితో కలిసి రమణ పర్యవేక్షిస్తున్నారు. పకడ్బందీ ప్రమాణాలు, సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ కలపను చెక్కుతూ రథాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.


