ఆటంకాలు లేకుండా అమ్మవారి దర్శనం | - | Sakshi
Sakshi News home page

ఆటంకాలు లేకుండా అమ్మవారి దర్శనం

Oct 23 2026 1:27 AM | Updated on Oct 23 2026 1:27 AM

విజయనగరం క్రైమ్‌: ఈ నెల 26,27 తేదీలలో జరగనున్న పైడితల్లి అమ్మవారి తొలేళ్లు, సిరిమానోత్సవం రోజుల్లో భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఉదయం ఎస్పీ ఏఆర్‌. దామోదర్‌తో కలిసి సిరిమానోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి పరిశీలించారు. కోట నుంచి మూడు లాంతర్లు, అమ్మవారి ఆలయం, శివాలయం వీధి కూడలి, అంబటి సత్రం జంక్షన్‌ వరకు, అలాగే దర్గా నుంచి శ్రీకాకుళం రోడ్డు వైపు చేపడుతున్న బారికేడ్ల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల క్యూలు, ఆలయ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, వాహనాల రాకపోకల నియంత్రణ, పోలీసు బందోబస్తు, ప్రసాదం కౌంటర్ల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. రద్దీని నిరంతరం పర్యవేక్షించేందుకు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి, కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచాలని సూచించారు. భక్తులకు వైద్య సేవలు అందించేందుకు అత్యవసర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ప్రమాదాల నివారణకు ప్రత్యేక నిఘా

ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పాడుబడిన భవనాలు, ప్రమాదకరమైన నిర్మాణాలపైకి ఎక్కకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, ఎస్పీ సూచించారు. సిరిమానోత్సవ మార్గంలో రద్దీని నియంత్రిస్తూ, రోప్‌ పార్టీ సహకారంతో విధులకు సంబంధించిన వారు, అవసరమైన అనుమతి కలిగిన వారు మాత్రమే నిర్దేశిత మార్గంలోకి ప్రవేశించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి తొక్కిసలాటలకు, అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం

తుఫాన్‌ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అందుకు అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా భక్తులకు ఇబ్బందులు కలగకుండా, అవసరమైన సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి శాఖ తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్‌, ఎస్పీ స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో ఆర్డీవో సుధాసాగర్‌, దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ శిరీష, ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ లక్ష్మణరావు, స్థానిక తహసీల్దార్‌ శ్రీనివాసరావు, పోలీసు, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కంట్రోల్‌ రూమ్‌లు, సీసీ కెమెరాల ఏర్పాటు

సిరిమాను తిరిగే ప్రాంతాలు

సందర్శించిన కలెక్టర్‌, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement