ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు పీజీఆర్‌ఎస్‌ రద్దు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు పీజీఆర్‌ఎస్‌ రద్దు

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

విజయనగరం గంటస్తంభం: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌), డైలీ గ్రీవెన్స్‌ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు అక్టోబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 3 వరకు మున్సిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పీజీఆర్‌ఎస్‌ రద్దుచేస్తున్నట్టు స్పష్టంచేశారు. ప్రభుత్వ శాఖలన్నీ ఎన్నికల నిబంధనలను విధిగా పాటించాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించి వినతులను కలెక్టరేట్‌ కార్యాలయ పనివేళల్లో హెల్ప్‌డెస్క్‌ లేదా తపాలా విభాగంలో అందజేయవచ్చని సూచించారు.

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు

విజయనగరం గంటస్తంభం: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల సిబ్బంది కేటాయింపు, రాండమైజేషన్‌, రవాణా ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై శుక్రవారం సమీక్షించారు. జిల్లాలో మున్సిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు మొత్తం 12,944 మంది సిబ్బంది అవసరమని అంచనా వేయగా, 17,487 మంది సిబ్బందిని ప్రతిపాదించినట్లు కలెక్టర్‌ తెలిపారు. వివిధ శాఖల నుంచి సిబ్బంది వివరాలను సేకరించి, నిబంధనల ప్రకారం విధులు కేటాయించాలని ఆదేశించారు. జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి 121 వార్డులు, 322 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా, మొత్తం 4,91,409 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వివరించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో అవసరమైన సిబ్బంది, ఎన్నికల సామగ్రి, మౌలిక సదుపాయాలు సమకూర్చి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఎన్నికల విధుల నుంచి మినహాయింపులు కోరే అభ్యర్థనలను నిబంధనల మేరకు పరిశీలించాలని, గర్భిణులు, వైద్యపరమైన సమస్యలు ఉన్నవారి వివరాలను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఇ.మురళి, జెడ్పీ సీఈఓ లవరాజు, డీఈఓ యు.మణిక్యంనాయుడు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ ప్రసాద్‌, మున్సిపల్‌, జీఎస్‌డబ్ల్యూఎస్‌, ఆర్టీసీ, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలి

● పీటీసీని సందర్శించిన డీఐజీ(శిక్షణ) విశాల్‌ గున్నీ

విజయనగరం టౌన్‌: పోలీస్‌ శిక్షణకు వచ్చే అభ్యర్థులకు సంప్రదాయ పోలీసింగ్‌తో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలని డీఐజీ (శిక్షణ) విశాల్‌గున్నీ అధికారులకు సూచించారు. విజయనగరం పీటీసీని శుక్రవారం ఆయన సందర్శించి, కళాశాలలోని వివిధ విభాగాలు, పరిపాలన కార్యాలయం, తరగతి గదులు, శిక్షణ మైదానం, అధికారుల లాంజ్‌, తదితర వసతులను పరిశీలించారు. పరిపాలన కార్యాయంలో నిర్వహిస్తున్న విధులు, రికార్డుల నిర్వహణ, తరగతి గదుల్లో అందుబాటులో ఉన్న బోధన సదుపాయాలు, మైదానంలో నిర్వహిస్తున్న శారీరక శిక్షణ కార్యక్రమాలు, అధికారుల లాంజ్‌ నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సైబర్‌ నేరాలు, సైబర్‌ భద్రత, కృత్రిమ మేధస్తు (ఏఐ), సీసీటీఎన్‌ఎస్‌, డిజిటల్‌ పోలీసింగ్‌, ఆన్‌లైన్‌ మోసాల దర్యాప్తు, డిజిటల్‌ సాక్ష్యాల సేకరణ, ఆధునిక నేర పరిశోధనా పద్ధతుల పరిజ్ఞానం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపాల్‌ డి.రామచంద్రరాజు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డి.కోటేశ్వరబాబు, డీఎస్పీ టి.రమేష్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement