చీపురుపల్లి: ఆ పాఠశాలకు వెళ్తే తరగతి గదుల్లో గోడలు ఖాళీగా కనిపించవు. విద్యార్థులు నుంచి తెలుగు, ఆంగ్ల పదాలు తప్ప మరో మాట వినిపించదు. తరగతి గది గోడలపై ఎటు చూసినా ఏదో ఒక యాక్టివిటీ కనిపిస్తుంది. విద్యార్థులకు ఆ రోజంతా ఏదో ఒక యాక్టివిటీతోనే గడిచిపోతుంది. అందుకనే ఆ పాఠశాలకు ఎవరు వెళ్లినా పదాల సవ్వడితో సందడిగా ఆహ్వానం పలుకుతుంది. అదే మండలంలోని పుర్రేయవలస బడి. ఇక్కడి పాఠశాలలో ఏదో ఆదరా బాదరగా పాఠ్యాంశాలు బోధన ఉండదు. ప్రతీ సబ్జెక్టులోనూ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్‌ఎం) వినియోగిస్తూనే బోధన సాగిస్తుండడంతో విద్యార్థుల్లో ఆ పాఠ్యాంశం ఆకట్టుకుంటుంది. ఉపాధ్యాయుల్లో ప్రత్యేక శ్రద్ధ ఉండాలిగాని ప్రైవేటు పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన జరుగుతుందని చెప్పడానికి పుర్రేయవలస ప్రాధమిక పాఠశాల తరగతి గదుల్లో అనుసరిస్తున్న విద్యాబోధన నిదర్శనంగా నిలుస్తోంది.
తరగతి గదిలో ఎటు చూసినా తెలుగు, ఇంగ్లిష్ పదాలే
పుర్రేయవలస ప్రాధమిక పాఠశాలలో తరగతి గోడలు ఖాళీగా ఉండవు. ఎటు వైపు చూసినా తెలుగు, ఇంగ్లిష్ పదాలతో కూడిన చార్టులు, చిత్రాలు దర్శనమిస్తాయి. తెలుగు, ఇంగ్లిష్‌లో కఠిన పదాలు నుంచి ఇంగ్లిష్ గ్రామర్‌కు సంబంధించిన చార్టులు, కాన్సెప్ట్ వంటి ఎన్నో చార్టులు పాఠశాల హెచ్‌ఎం ఎంవి.భారతి, సహాయ ఉపాధ్యాయుడు అప్పలనాయుడులు తమ ఇళ్ల వద్ద స్వంతంగా తయారు చేసి పాఠశాలకు తీసుకొచ్చి విద్యార్థులకు బోధిస్తుంటారు. విద్యార్థులకు సులభంగా అర్థమవ్వడం కోసం ప్రతీ పాఠ్యాంశాన్ని టీఎల్‌ంఎ ద్వారానే బోధిస్తుంటారు. టీఎల్‌ఎం, చార్టులు, చిత్రాలు తయారీకు ఎలాంటి నిధులు ఉండకపోయినప్పటికీ స్వంత నిధులతోనే సిద్ధం చేస్తుంటారు.
ప్రాధమిక స్థాయిలోనే ఇంగ్లిష్ గ్రామర్ బోధన
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో రెండు, మూడు తరగతుల నుంచి ఇంగ్లిష్ గ్రామర్ బోధన వింటుంటాం. అయితే వారికి ధీటుగా పుర్రేయవలస ప్రాధమిక పాఠశాలలో కూడా ప్రాధమిక స్థాయిలోనే ఇంగ్లిష్ గ్రామర్ బోధిస్తున్నారు. గ్రామర్‌కు సంబంధించి టెన్సెస్, వెర్బ్, యాడ్జెక్టివ్, నౌన్, ప్రౌనౌన్ వంటి గ్రామర్ అంశాలు అక్కడ విద్యార్థులకు చిన్న వయస్సులోనే పరిచయం చేస్తున్నారు. తెలుగులో సైతం గుణింతాలు, ద్విత్తక్షరాలు, గణితంలో టేబుల్స్ తదితర చార్టులు ప్రదర్శించి నిరంతరం విద్యార్థులతో సాధన చేయిస్తుంటారు.
ప్రాధమిక స్థాయిలోనే ఇంగ్లిష్ గ్రామర్‌లో తర్ఫీదు
తరగతి గదిలో ఎటు చూసినా తెలుగు, ఇంగ్లిష్ పదాలే..
ప్రతీ పాఠ్యాంశాన్ని టీఎల్‌ఎం ద్వారా బోధన
ప్రాధమిక స్థాయిలోనే మంచి పునాది ఉండాలి
పాఠశాలకు వచ్చే పిల్లలకు ప్రాధమిక స్థాయిలోనే మంచి పునాది ఉండాలి. ప్రభుత్వ పాఠశాలకు పేద వర్గాలకు చెందిన పిల్లలే వస్తారు. అలాంటి వారిని తీర్చిదిద్దడమే తమ లక్ష్యం. అందుకనే ఇంగ్లిష్, తెలుగులో ప్రతీ పాఠానికి టీఎల్‌ఎం ద్వారా బోధిస్తాం. ఇంగ్లిష్ గ్రామర్‌లో నౌన్స్, టెన్సెస్, స్పెల్లింగ్స్, కాన్సెప్ట్ మ్యాపింగ్, పిక్చర్ డిస్క్రిప్షన్ వంటి బోధన సాగిస్తున్నాం. తరగతి గది మోడల్‌గా ఉంటే విద్యార్థులు కూడా అంతే ఆదర్శంగా తయారవుతారు.
– ఎంవి.భారతి, హెచ్‌ఎం, పుర్రేయవలస
ప్రాధమిక పాఠశాల, చీపురుపల్లి


