గంట్యాడ: డబ్బులు కావాలంటూ తల్లిదండ్రులను వేధిస్తూ వారిపై దాడికి యత్నించిన యువకుడిని అడ్డుకున్న వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని మధుపాడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మధుపాడ గ్రామానికి చెందిన సీహెచ్ విజయ్‌కుమార్ తన తల్లిదండ్రులు సన్యాసిప్పుడు, ఈశ్వరమ్మను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దాడికి యత్నించాడు. అదే సమయంలో సమీపంలో ఉన్న ద్వారపురెడ్డి కృష్ణ అడ్డుకోవడంతో విజయ్‌కుమార్ ఆయుధంతో అతడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో కృష్ణ చెవికి తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి రలించారు. ఘటనపై ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సాయికృష్ణ తెలిపారు.
కారు షెడ్‌లో అగ్ని ప్రమాదం
కొత్తవలస: మండలంలోని అరుకు–విశాఖ జాతీయ రహదారిని ఆనుకొని అడ్డూరువానిపాలెం గ్రామం సమీపంలో గల ఎస్‌ఎల్‌జీ కార్ కేర్ కార్ మెకానిక్ షెడ్‌లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో షెడ్‌లో గల మూడు కార్లు, రెండు పాత కార్లు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద వార్త తెలుసుకొని కొత్తవలస అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు షెడ్ యజమాని కె.గౌరీపతి తెలిపారు.
10 నుంచి జేవీవీ ఆధ్వర్యంలో వక్తృత్వ, కథల పోటీలు
విజయనగరం అర్బన్: విద్యార్థులను మంచి ఉపన్యాసకులుగా, నాయకత్వ లక్షణాలు కలిగిన వారిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి వక్తృత్వ, కథల పోటీలను నిర్వహించనున్నట్టు జేవీవీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎరుకొండ ఆనంద్, డాక్టర్ మిరియాల కృష్ణారావు తెలిపారు. కంటోన్మెంట్ గురజాడ పాఠశాలలో ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను వారు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజేతలకు నగదు పురస్కారాలతో పాటు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. జేవీవీ జాతీయ నాయకుడు గండ్రేటి లక్ష్మణరావు, గండ్రేటి అప్పలనాయుడు, జిల్లా కోశాధికారి శివాజీ, తిరుపతిరావు, చిరంజీవి, సత్యనారాయణ, ఈశ్వర్ పాల్గొన్నారు.


