● రెండు నెలలుగా పట్టించుకోని సర్వజన ఆస్పత్రి అధికారులు
విజయనగరం ఫోర్ట్: టీడీపీ సర్కార్ నిర్వాకం కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. నెలల తరబడి రోగులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వ పట్టించుకున్న పాపాన పోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రెండు నెలలుగా థైరాయిడ్ పరీక్షలు జరగడం లేదు. బోధనాస్పత్రి కావడంతో అన్ని రకాల వైద్యసేవలు అందుతాయని జిల్లా నలుమూలల నుంచి నిత్యం అధిక సంఖ్యలో రోగులు సర్వజన ఆస్పత్రికి వస్తారు. అయితే టీడీపీ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా సౌకర్యాల కొరత వల్ల రోగులు అవస్థలు పడుతున్నారు. 1200 నుంచి 1400 మంది వరకు రోజుకు ఆస్పత్రికి ఓపీ విభాగాలకు రోగులు వస్తారు. ఇంత పెద్ద ఓపీ ఉన్నప్పటికీ సర్కార్ అలసత్వం వల్ల రోగులకు వైద్య సేవలు అందడం గగనంగా మారింది,. థైరాయిడ్ పరీక్షలు చేయడానికి అవసరమైన రియాజెన్స్ అయిపోయి రెండు నెలలైంది. ఇంతవరకు టీడీపీ సర్కార్ వాటిని సరఫరా చేయలేదు. దీంతో రోగులు ప్రైవేట్ ల్యాబొరేటరీల్లో రూ.600 నుంచి రూ. 800 వెచ్చించి థైరాయిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు.
ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టాం
థైరాయిడ్ పరీక్షలు నిలిచిపోయిన మాట వాస్తవమే, థైరాయిడ్ పరీక్షలకు అవసరమైన రియాజెన్స్ ఇంకా సరఫరా కాలేదు. ప్రభుత్వానికి ఇండెంట్ కూడా పెట్టాం.
డాక్టర్ అల్లు పద్మజ,
సర్వజన ఆస్పత్రి, సూపరింటెండెంట్


