ఇది దుర్మార్గం
మామిడి ఎగుమతుల కోసం ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డును ఇతర అవసరాలకు మార్చడం దుర్మార్గం. మామిడి ఎగుమతులు పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. అదనంగా గోదాములు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్‌లు ఏర్పాటు చేయాలి. – బుద్దరాజు రాంబాబు,
జిల్లా రైతు సంఘం కార్యదర్శి
ప్రభుత్వాస్తులను ప్రైవేటుకు కట్టబెట్టడం దారుణం
ప్రైవేటు సంస్థలకు మేలు చేకూర్చే విధంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ భూమిని రైతులు సంక్షేమానికి ఉపయోగించాలి కానీ, ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ఎంతవరకు సమంజసం.
– కె.శ్రీనివాస్, రైతు సంఘం నాయకుడు, గంట్యాడ
జీఓ విడుదలైంది
వీటీ ఆగ్రహారం–చిల్లపేటరోడ్డులో ఉన్న మామిడి మార్కెట్ యార్డులో ఒక గోదామును, 6.72 ఎకరాల భూమిని యసశ్రీ విరోహా ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించినట్టు జీఓ విడుదలైనట్టు తెలిసింది. ఉన్నతాధికారులు ఇంకా సమాచారం ఇవ్వలేదు.
– బి.రవికిరణ్, ఏడీ, మార్కెటింగ్‌శాఖ
విజయనగరం ఫోర్ట్:
విజయనగరం పట్టణంలోని వి.టి.ఆగ్రహారం–చిల్లపేట రోడ్డులో మామిడి మార్కెట్ యార్డు ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో రైతులకు మేలుచేసేలా మార్కెట్‌యార్డును నిర్మించారు. ఇప్పుడు ఇందులో 8,648.23 చదరపు అడుగులు గల గోదాముతో పాటు 6.72 ఎకరాల ఖాళీ భూమిని విశాఖపట్నానికి చెందిన యశశ్రీ విరోహా ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు లీజుకిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ నంబర్ 576ను జారీ చేసింది. విషయం తెలిసిన రైతులు మండిపడుతున్నారు. మామిడి మార్కెట్ యార్డు వద్ద ఎకరం భూమి ధర సుమారుగా రూ.20 కోట్ల నుంచి రూ.22 కోట్ల మధ్య పలుకుతోంది. 6.72 ఎకరాల భూమి విలువ సుమారుగా రూ.130 కోట్ల పైబడి ఉంటుంది. గోదాం విలువ సుమారుగా రూ.20 కోట్ల వరకు ఉంటుంది. మొత్తంగా రూ.150 కోట్ల విలువైన ఆస్తిని నెలకు రూ.5.51 లక్షలకు (6.72 ఎకరాల భూమికి నెలకు రూ.5.04 లక్షలు, గోదాముకు రూ.47,565లు) లీజుకు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రెండేళ్ల గడువుతో లీజు ఒప్పందం కుదిరినా క్రమేణా లీజు గడువు పొడిగిస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలం కాస్తా ప్రైవేటు సంస్థ చేతుల్లోకి వెళ్లిపోతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ స్థలాన్ని వినియోగించకుండా ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై ఆందోళన, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గోదాములు లేక ఇబ్బందులు పడుతున్నా..
జిల్లా రైతులు వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలను ఎక్కువగా సాగుచేస్తారు. వరి పంట ఖరీఫ్‌లో లక్ష హెక్టార్లలోను, మొక్కజొన్న 18 వేలు హెక్టార్లు, పత్తి 6 వేల హెక్టార్లలో సాగవుతోంది. మొక్కజొన్న గింజలను నిల్వ చేసుకోవడానికి గోదాములు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రాని సమయంలో పంటను నిల్వ చేసేందుకు వసతులు లేక అతి తక్కువ ధరకు దళారులకు విక్రయిస్తున్నారు. పత్తి రైతులదీ అదే పరిస్థితి. మద్దతు ధర లేనప్పుడు నిల్వచేసుకోలేని దుస్థితి. టీడీపీ సర్కార్ రైతులకు ఉపయోగపడే గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌లు వంటివి నిర్మిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆ దిశగా ఆలోచన చేయకుండా ఉన్న గోదాములు, మార్కెట్ యార్డులను లీజుకు ఇచ్చేస్తుండడంపై రైతులు మండిపడుతున్నారు.
వైఎస్సార్ హయాంలో మార్కెట్ యార్డు ఏర్పాటు
జిల్లా రైతుల మామిడి, జీడి మామిడి, అరటి, బొప్పాయి పంటలు విస్తారంగా సాగుచేస్తారు. ముఖ్యంగా మామిడి 45 వేల హెక్టార్లలో సాగవుతోంది. ఏటా జిల్లా నుంచి కోల్‌కతా, చైన్నె, ముంబయి, ఢిల్లీ, ఒడిశా వంటి ప్రాంతాలకు మామిడి ఉత్పత్తులను ఎగుమతిచేస్తారు. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్‌కు అనుకుని ఉన్న స్థలంలో అప్పటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి మామిడి మార్కెట్ యార్డు ఏర్పాటు చేశారు. రైతులకు మేలుచేయాలన్న గొప్ప సంకల్పంతో మార్కెట్ యార్డును రైతులకు అందుబాటులోకి తెచ్చారు. దీనిని టీడీపీ ప్రభుత్వం లీజు పేరిట ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంపై రైతాంగం ఆందోళన చెందుతోంది.
టీడీపీ సర్కార్ తీరుపై మామిడి రైతుల ఆగ్రహం
రూ.150 కోట్లు విలువైన మార్కెట్ యార్డు స్థలాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగింత
గోదామునూ లీజుపేరిట కట్టబెట్టిన వైనం
ప్రైవేటు సంస్థలపై ఉన్న ప్రేమ రైతులపై లేదనే విమర్శలు
కొత్త గోదాములు నిర్మించకుండా ఉన్నవి లీజుకు ఇవ్వడంపై ఆందోళన


